Sports News: చిట్టి పొట్టి ప్రపంచకప్ లో క్రికెట్ పసికూన, ఆతిథ్య యూఎస్ఏ తరఫున ఆడుతోన్న సౌరభ్ నేత్రావల్కర్ క్రికెట్ ప్రేమికులతో పాటు మొత్తం ప్రపంచం దృష్టినే ఆకర్షిస్తున్నాడు. కలల్లో మాత్రమే సాధ్యమయ్యే ఫేమ్ భారత సంతతికి చెందిన ఈ కుర్రోడికి అతి తక్కువ రోజుల్లో రావడం విశేషం.


పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్ మొత్తం అద్భుతంగా బౌలింగ్ చేసి సూపర్ ఓవర్‌లో గెలిపించాడు. అలాగే భారత్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వికెట్లు తీసి స్వల్స లక్ష్యాన్ని ఛేధించేందుకు ఇండియన్ బ్యాటర్లకు చెమటలు పట్టేలా చేశాడు.  అయితే ఈ ఫీట్లన్నీ సౌరభ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ చేశాడంటే నమ్మగలరా..? కానీ ఇదే నిజం. స్వయంగా సౌరభ్ నేత్రావల్కర్ సోదరి నిధి ఈ విషయాన్ని ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్రువీకరించింది. 


‘‘ నా తమ్ముడు ఎక్కడ మ్యాచ్  జరిగినా అక్కడికి ఒక ల్యాప్ టాప్ తీసుకెళ్తాడు. వాడు ఏ పని చేసినా చాలా అంకితభావంతో చేస్తాడు. అలాగే మల్టీటాస్కింగ్ చేయగలడు. నిజానికి వాడికి తన గేమ్ అయిపోగానే వర్క్ చేసుకునే అలవాటుంది. తాను తీసుకుని వెళ్లే ల్యాప్ టాప్‌ ముందు కూర్చొని టైం వేస్ట్ చేయకుండా పనిచేస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచీ నా తమ్ముడు వైఖరి ఇంతే. అప్పుడు కూడా క్రికెట్ ఆడుతూనే క్లాస్ టాపర్ గా నిలిచేవాడు. ప్రస్తుతం వాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఆడుతున్నాడు. కెరీర్ విషయంలో చాలా మంది వాడికి సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా ఇది వాడి అదృష్టం.


ఇంత మంది సహకారంతోనే వాడు తన ఆటని సక్రమంగా ఆడగలుగుతున్నాడు. క్రికెట్ ఆడని టైమ్ అంతా తన జాబ్ కు కేటాయించాలని, అక్కడ కూడా 100 శాతం న్యాయం చేయాలని వాడికి తెలుసు. అందుకే కచ్చితంగా డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా ల్యాప్టాప్ తీసుకెళ్లిపోతాడు. తన కంపెనీలో ఎక్కడినుంచైనా వర్క్ చేసే అవకాశం వాడికి ఇచ్చారు.’’ అని నిధి ఓ చెప్పుకొచ్చారు.  


ఈ విషయం తెలిసిన నెటిజన్లు సౌరభ్ నేత్రావల్కర్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.  క్రికెట్ విశ్లేషకుడు, ప్రేమికుడు ముఫద్దల్ వోహ్రా ట్విటర్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేయగానే.. ఆ పోస్టు కింద సౌరభ్ పట్ల తమ ప్రేమను నెటిజన్లు గుమ్మరిస్తున్నారు.  యూఎస్ఏకు ఆడుతున్నా..  మొత్తమ్మీద మనోడే అన్న భావన ఇండియన్లలో బాగా కనిపిస్తోంది. 


‘‘ఈ ఫుల్ టైమ్ ఇంజినీర్,  పార్ట్ టైమ్ క్రికెటర్‌కి ఉన్న టాలెంట్ ప్రపంచంలో ఉన్న చాలా మంది ఫుల్ టైమ్ క్రికెటర్లకు లేదు’’ అని ఒకరంటే.. ‘‘మీ కలలని సాకారం చేసుకుంటూనే చక్కగా చదువుకుంటే నేత్రావల్కర్ లాగా మల్టీ టాస్కింగ్ చేయొచ్చు’’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ‘‘ప్యాషన్ తో కూడిన ప్రొఫెషన్ చేస్తోన్న సౌరభ్ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలిసిన వాడ’’ ని కొనియాడుతున్నారు. 


ఒకప్పుడు అండర్ 19 ప్రపంచకప్ లో భారత్ తరఫున ఆడిన సౌరభ్ నేత్రావల్కర్ యూఎస్ఏ తరఫున వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని ప్రపంచమంతా తనవైపు చూసేటట్లు చేస్తున్నాడు. 


సౌరభ్ నేత్రావల్కర్ ఇప్పటి వరకూ సాధించిన విజయాలు.. 



  • భారత్ తరఫున అండర్ 19 క్రికెట్ ప్రపంచకప్‌లో ఆడాడు. 

  • బాగా చదువుకుని అమెరికాకు వెళ్లిపోయాడు. ఒరాకిల్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.

  • యూఎస్ఏ జాతీయ జట్టుకు ఆడుతున్నాడు.

  • పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ లో 18 పరుగులు చేతిలో ఉండగా పాక్ ను 13 పరుగులకే కట్టడి చేశాడు.

  • ఇండియాతో జరిగిన మ్యాచ్ లో కేవలం ఎనిమిది బంతుల్లో కోహ్లీ, రోహిత్ శర్మల వికెట్లు తీశాడు.