Afghanistan Thrash PNG To Qualify For Super 8: టీ 20 ప్రపంచకప్( T20 World Cup 2024)లో గ్రూప్ సీలో అఫ్గానిస్థాన్(Afghanistan)... సూపర్ 8కు దూసుకొచ్చింది. పసికూన పపువా న్యూ గినియా(PNG)తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన అఫ్గాన్.. సూపర్ 8లో స్థానం ఖాయం చేసుకుంది. అఫ్గాన్ సూపర్ 8 ఎంట్రీతో గ్రూప్ సీలో మిగిలిన జట్లు న్యూజిలాండ్, ఉగాండ్, పపువా న్యూ గినియా లీగ్ దశలోనే వెనుదిరిగాయి. ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కివీస్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయి లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా 95 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్ సునాయసంగా ఛేదించి సూపర్ ఎయిట్‌లోకి దూసుకొచ్చింది.
మరో ఘన విజయం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అఫ్గాన్ బౌలర్లు రాణించడంతో పపువా బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. రెండో ఓవర్లోనే పపువా తొలి వికెట్ కోల్పోయింది. అసద్ వాలా రనౌట్ కావడంతో పపువా తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 12 పరుగుల వద్దే పపువా తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం ఫరూకి పపువాను చావు దెబ్బ తీశాడు. వరుసగా రెండు వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. లెగా సియాక, సెసే బౌ వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. దీంతో అదే 12 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కాసేపటికి హిరీ హిరీ...టోనీ యురా కూడా అవుట్ కావడంతో పపువా న్యూ గినియా 30 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. తర్వాత కాసేపు వికెట్ల పతనం ఆగింది. పపువా బ్యాటర్లు కిప్లిన్ డోరిగా, చాద్ సోపర్ కాసేపు అఫ్గాన్ బౌలర్లను అడ్డుకున్నారు. వీరు కాసేపు బాగా ఆడడంతో పపువా మంచి స్కోరు చేసేలా కనిపించింది. కానీ చాద్ సోపర్ రనౌట్ కావడంతో పపువాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. తొమ్మిది పరుగులు చేసి సోపర్ అవుటయ్యాడు. దీంతో 46 పరుగుల వద్ద పపువా ఆరో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వెంటనే నార్మన్ వనువా కూడా రనౌట్ కావడంతో 50 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. పపువా బ్యాటర్లలో కాసేపు పోరాడిన డోరిగాను నూర్ అహ్మద్ అవుట్ చేయడంతో పపువా పోరాటం ముగిసింది. డోరిగా 32 బంతుల్లో 27 పరుగులు చేశాడు. పపువా జట్టులో ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పపువా బ్యాటర్లలో నలుగురు రనౌట్ కావడం విశేషం. అఫ్గాన్ బౌలర్లలో ఫరూకీ మూడు, నవీనుల్ హక్ రెండు వికెట్లు తీశారు.
సునాయసంగానే
96 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్... 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. గుల్బదీన్ 49 పరుగులతో అజేయంగా నిలిచి అఫ్గాన్‌కు విజయాన్ని అందించాడు. అఫ్గాన్ ఓపెనర్లు రహ్మతుల్లా గుర్బాజ్ 11, జర్దాన్ సున్నా పరుగులకే వెనుదిరగడంతో అఫ్గాన్ 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. పపువా ఏమైనా అద్భుతం చేస్తుందా అని అనిపించింది. కానీ గుర్బాజ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నబీ, ఉమ్రాజాయ్ కూడా పర్వాలేదనిపించండతో అఫ్గాన్.. మరో 29 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి సూపర్ 8లోకి విజయం సాధించింది. అఫ్గాన్ విజయంతో కివీస్ సూపర్ 8 ఆశలు ఆవిరైపోయాయి.