India vs USA Highlights: టి20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాతో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో భారత జట్టు విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో సూపర్-8 దశకు చేరుకున్న మూడో జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సూపర్ 8కు అర్హత సాధించాయి. అమెరికా జట్టు విధించిన స్వల్ప లక్ష్యాన్ని చేరుకునేందుకు భారత జట్టు చెమటోడ్చాల్సి వచ్చింది. కొద్దిరోజుల కిందట జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుకు షాక్ ఇచ్చిన అమెరికా జట్టు చేసిన చిన్న తప్పిదం భారత్ కు వరంగా మారింది. కీలకమైన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు 110 పరుగులు చేసింది. 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చేదనకు తీవ్రంగా ఇబ్బంది పడింది. తొలి నుంచి బౌలింగ్ అనుకూలిస్తున్న నసావు కౌంటి క్రికెట్ స్టేడియంలో పరుగులు చేయడానికి భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఆమెరికా జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత 7.3 ఓవర్లలో 44 పరుగులు చేసి మూడు వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది. ఈ దశలో భారత గట్టును సూర్య కుమార్ యాదవ్ (50 నాటౌట్), శివం దూబే (31 నాటౌట్) తుది వరకు క్రీజులో ఉండి 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చారు. మరో పది బంతులు మిగిలి ఉండగానే మ్యాచును ముగించారు.
ఊహించని మలుపుతో భారత్ కు అదనంగా ఐదు పురుగులు - 5 Penalty Runs
భారత జట్టు 15 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు నష్టపోయి 76 పరుగులు చేసింది. 30 బంతుల్లో 35 పరుగులు చేయాల్సి ఉంది. అయితే సవాళ్లతో కూడిన నసావు కౌంటీ ట్రాక్ లో ఈ పరుగులు చేయడం కూడా భారత జట్టుకు కష్టంగా మారింది. అప్పటికే క్రీజులో ఉన్న ఆటగాళ్లు పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో మ్యాచ్ అనూహ్య మలుపు తిరిగింది. అమెరికా జట్టు మూడుసార్లు ఓవర్ల మధ్య ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం తీసుకోవడంతో ఐదు పరుగులను పెనాల్టీగా విధించారు. దీంతో భారత జట్టు లక్ష్యం 30 బంతుల్లో 30 పరుగులకు తగ్గింది. ఇది భారత జట్టు ఒత్తిడిని తగ్గించి జట్టు సునాయాస విజయాన్ని అందుకునేలా చేసింది.
అందుకే ఐదు పరుగులు పెనాల్టీ..
కొత్తగా తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం ఒక ఇన్నింగ్స్ లో మూడుసార్లు కొత్త ఓవర్ ప్రారంభించేందుకు 60 సెకండ్లకు మించి సమయం తీసుకుంటే పెనాల్టీ విధిస్తారు. అమెరికా జట్టు భారత్ తో ఆడిన మ్యాచ్ లో మూడుసార్లు ఓవర్ ప్రారంభించడానికి 60 సెకన్లకు మించి సమయాన్ని తీసుకుంది. నిర్ణీత గడువు లాగా అమెరికా జట్టు ఓవర్లను ప్రారంభించడంలో పదేపదే విఫలమవడంతో ఎంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారత జట్టు మిగిలిన 30 పరుగులను మరో పది బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. స్వల్ప స్కోరును ఛేదించే క్రమంలో ఇబ్బందులు పడుతున్న భారత జట్టుకు అదనంగా కలిసి వచ్చిన ఈ ఐదు పరుగులు అద్భుతమైన విజయాన్ని సాధించేలా చేశాయి.