England crush Oman by 8 wickets: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌(England)  రికార్డు సృష్టించింది. పసికూన ఒమన్‌(Oman)తో జరిగిన మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించింది. కేవలం 19  బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి సూపర్‌ ఎయిట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఛాంపియన్‌ ఆటతీరు ప్రదర్శించిన బ్రిటీష్‌ జట్టు తొలుత బంతితో ఆ తర్వాత బ్యాట్‌తో చెలరేగిపోయింది. ఏ దశలోనూ ఒమన్‌ను కనీసం ఊపిరి కూడా తీర్చుకోలేదు. కేవలం పదహారు ఓవర్లలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఘన విజయంతో ఇంగ్లండ్‌.. నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంది. గ్రూప్‌ బీ లో ఇంగ్లండ్‌ మూడు మ్యాచుల్లో మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా... స్కాట్లాండ్‌ మూడు మ్యాచులతో అయిదు పాయింట్లతో  రెండో స్థానంలో ఉంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ నమీబియాతో... స్కాట్లాండ్‌.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచుల్లో గెలుపు... గ్రూప్‌ బీలో సూపర్‌ ఎయిట్‌ బెర్తులను ఖరారు చేయనుంది. ఇక నమీబియాతో జరిగే మ్యాచ్‌లో కూడా భారీ విజయం సాధిస్తే బ్రిటీష్‌ జట్టు సూపర్‌ 8 ఆశలు మెరుగవుతాయి.


ఛాంపియన్‌లా
 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ మరో ఆలోచన లేకుండా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలన్న ఆలోచనతో బట్లర్‌... ఒమన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పసికూన ఒమన్‌ను ఇంగ్లండ్‌ బౌలర్లు వణికించారు. ఒమన్‌ బ్యాటర్లలో టాప్‌ స్కోరు కేవలం 11 పరుగులంటే బ్రిటీష్‌ బౌలర్లు ఎలా చెలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు. రెండో ఓవర్‌లో ప్రారంభమైన ఒమన్ వికెట్ల పతనం ఆ తర్వాత కూడా కొనసాగింది. ఆరు పరుగుల వద్ద ఒమన్ తొలి వికెట్‌ కోల్పోయింది. ప్రతీక్‌ అథవాలేను ఆర్చర్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత కశ్యప్‌ ప్రజాపతి తొమ్మిది పరుగులు చేసి అవుటయ్యాడు. కెప్టెన్‌ అక్విబ్‌ కూడా ఎనిమిది పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో ఒమన్‌ కేవలం 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.  ఆ తర్వాత ఒమన్‌ వికెట్ల పతనం మరింత వేగం పుంజుకుంది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మక్‌సూద్‌ 1, ఖలీద్‌ ఖైల్‌ 1, అయాన్‌ ఖాన్‌ ఒక్క పరుగు చేసి అలా వచ్చి ఇలా పెవిలియన్‌కు వెళ్లారు. షోయబ్‌ ఖాన్‌ ఒక్కడే పదకొండు పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 23 బంతుల్లో 11 పరుగులు చేసిన షోయబ్‌ ఖాన్‌ను అర్చర్‌ అవుట్‌ చేయడంతో ఇక మిగిలిన వికెట్లు టపాటపా నేలకూలాయి. ఒమన్‌ బ్యాటర్లలో ఏడుగురు కనీసం అయిదు పరుగులను కూడా దాటలేకపోయారు. దీంతో ఒమన్‌ 13.2 ఓవర్లలో 47 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో అదిల్‌ రషీద్‌ నాలుగు ఓవర్లు వేసి కేవలం 11 పరుగులు చేసి నాలుగు వికెట్లు నేలకూల్చాడు. మార్క్‌ వుడ్‌ 3, జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు తీసి ఒమన్ పతనాన్ని సంపూర్ణం చేశారు. 


బాదుడే బాదుడు
సూపర్‌ 8(Super -8)కు చేరాలంటే ఘన విజయం సాధించడం అత్యావశ్యం కావడంతో ఇంగ్లండ్‌ బౌలర్లు ఈ స్వల్ప లక్ష్యాన్ని త్వరగా ఛేదించాలన్న నిర్ణయంతో బరిలోకి దిగారు. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌, జోస్‌ బట్లర్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. మూడు బంతుల్లో 2 సిక్సులతో 12 పరుగులు చేసి ఫిల్‌ సాల్ట్‌ అవుటవ్వగా... విల్‌ జాక్స్‌ ఏడు బంతుల్లో అయిదు పరుగులు చేసి అవుటయ్యాడు. కానీ కెప్టెన్ జోస్‌ బట్లర్‌  కేవలం 8 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సుతో 24 పరుగులు చేసి కేవలం 3.1 ఓవర్‌లోనే ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించాడు.