Khammam News: విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు కొందరు తమ విచక్షణను మరచి పోయి వికృతంగా ప్రవర్తిస్తున్నారు. చదువుసంద్యా చెప్పాల్సిన కొందరు ఉపాధ్యాయులు పిల్లలపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. విద్యార్థులు చితకబాదిన ఘటనలు, వాతలు వచ్చేలా కొట్టిన సందర్భాలు ఎక్కడో ఓ చోట తరచూ వింటూనే ఉంటాం. పిల్లలు అన్నాక తప్పులు చేస్తుంటారు. వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత గురువులపైనే ఉంటుంది. విద్యార్థులు అంటే అబద్థాలూ చెబుతుంటారు.. వాటిని సరిచేయాల్సిందే టీచర్లే. తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు, విద్యార్థులు తెలిసీ తెలియక తప్పులు చేస్తే దారిలో పెట్టడం ఉపాధ్యాయల ధర్మం. 


నిజం చెబుతారా.. 


ఖమ్మం జిల్లా మధిరలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలికల వసతి గృహంలోని విద్యార్థులు నిజం చెప్పి శిక్ష ఎదుర్కొన్నారు. సత్యం చెప్పడమే వారి పాలిట శాపంగా మారింది. ఉన్నది ఉన్నట్లుగా చెబితే కర్రతో దెబ్బలు పడాల్సి వచ్చింది. నిజంగానే కొట్టారా, ఎందుకు కొట్టారంటూ ఆ ప్రిన్సిపల్ ను అడగ్గా.. అవును కొట్టాను అంటూ సమాధానం రావడం కొసమెరుపు.


వంటలు సరిగ్గా ఉండటం లేదంటూ విద్యార్థి సంఘం నాయకులకు చెప్పారనే కోపంతో ప్రిన్సిపల్ విద్యార్థినులను చితకబాదారు. విచక్షణారహితంగా కొట్టడంతో పలువు విద్యార్థులకు వాతలు తేలాయి. ఈ ఘటన గురువారం ఖమ్మం జిల్లా మధిరలోని మహాత్మా జ్యోతిబా పులే బీసీ గురుకుల బాలికల వసతి గృహంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థినుల కాళ్లకు వాతలు తేలి కమిలి పోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


కష్టాలు చెప్పుకుంటే కనికరం లేకుండా కొట్టారు


ఖమ్మం జిల్లా మధిరలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకులాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల బీసీ గురుకుల హాస్టల్ ను ఓ విద్యార్థి సంఘం నాయకులు సందర్శించారు. విద్యార్థినులు ఏమైన సమస్యలు ఎదుర్కొంటున్నారా అని అడగ్గా.. తమ కష్టాలు చెప్పుకున్నారు. హాస్టల్ లో భోజనం సరిగ్గా ఉండటం లేదని, కూరల్లో కారానికి బదులు ఎండుమిర్చి వాడుతున్నారని, దాని వల్ల కడుపు మంట వస్తోందని ఆ విద్యార్థి సంఘం నాయకులకు చెప్పుకున్నారు. భోజనం సరిగ్గా ఉండటం లేదన్న విషయాన్ని ఆ నాయకుడు ప్రిన్సిపల్ ను కలిసి ప్రశ్నించారు. విద్యార్థినులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని కోరారు. భోజనం సరిగ్గా వండేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసి వెళ్లిపోయారు.


ప్రిన్సిపల్ కొట్టడంతో విద్యార్థులకు వాతలు


హాస్టల్ లో భోజనం సరిగ్గా లేదని విద్యార్థి సంఘన నాయకుడికి చెప్పడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రిన్సిపల్ నజీమా... 20 మందికి పైగా బాలికలను తన గదిలోకి పిలిపించుకున్నారు. హాస్టల్ లో సమస్యలను విద్యార్థి సంఘం నాయకులకు చెబుతారా అంటూ కర్రతో ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. ప్రిన్సిపల్ నజీమా దాడిలో పలువురు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. చాలా మందికి వాతలు తేలాయి. పలువురికి కొట్టిన చోట కమిలి పోయింది. హాస్టల్ విషయాలు బయట ఎవరితోనైనా చెబితే మీ సంగతి చూస్తానంటూ 20 మంది విద్యార్థినులను చితకబాదారు. వసతి గృహంలోని సమస్యలను ఎవరికి చెప్పినా చితకబాదుతానని చెప్పి వార్నింగ్ ఇచ్చారంటూ బాధిత విద్యార్థినులు వెల్లడించారు. 


ఈ విషయం విద్యార్థి సంఘాల నాయకులకు తెలియడంతో వారు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి హాస్టల్ ను సందర్శించారు. ప్రిన్సిపల్ కొట్టిన ఘటనపై విచారణ జరిపించాలని కలెక్టర్ ను కోరారు. అయితే ఈ విషయంపై ప్రిన్సిపల్ నజీమాను వివరణ కోరగా.. అవును కొట్టానంటూ సమాధానం ఇచ్చారు. పదో తరగతి అంతర్గత పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని కొట్టినట్లు తెలిపారు. హాస్టల్ లో నాణ్యమైన భోజనమే అందిస్తున్నట్లు చెప్పారు.