FRO Srinivasa Rao Death: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు కుటుంబాన్ని స్థానిక నాయకులు, అధికారులు పరామర్శించారు. ఇటీవల పోడుభూమి సాగుదారుల దాడిలో చనిపోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కును అందజేశారు. FRO శ్రీనివాస్ రావు భార్య, పిల్లలకు చెక్కు అందజేసిన నేతలు, అధికారులు.. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (CCF) భీమా నాయక్, డీఎఫ్ఓ లు సిద్దార్థ్ విక్రమ్ సింగ్, రంజిత్ నాయక్  డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం మేయర్ నీరజ చెక్కు అందజేసిన వారిలో ఉన్నారు.  


ఈర్లపుడిలో సీసీఎఫ్ భీమా నాయక్ కామెంట్స్
విధి నిర్వహణకు వెళ్లిన ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్య బాధాకరం, అత్యంత దారుణం అన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కును వారి కుటుంబానికి అందజేసినట్లు తెలిపారు. శ్రీనివాసరావు కుటుంబానికి ప్రకటించిన ఉద్యోగం, ఇంటి స్థలము, పిల్లల చదువు, ఇతర బెనిఫిట్స్ విషయంలో సహకరిస్తామని చెప్పారు.


ఈ మేరకు తెలంగాణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ జూనియర్ అటవీ అధికారుల సంఘం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు కుటుంబానికి 50 లక్షల పరిహారం చెక్కును అందించిన స్థానిక ప్రజా ప్రతినిధులు, అటవీ అధికారులు. వేగంగా స్పందించి ఎక్స్ గ్రేషియా అందించి, కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమని, దోషులను కఠినంగా శిక్షిస్తామని, ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.


శ్రీనివాసరావు కుటుంబం కోసం ప్రకటించిన మిగతా హామీలను కూడా సకాలంలో నెరవేర్చి కుటుంబానికి ఊరట కలిగించాలని విన్నపం. భార్యకు డిప్యూటీ తహసీల్దార్ హోదా ఉద్యోగంతో పాటు, ఇంటి స్థలం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరుతున్నాం. ప్రభుత్వ ఆదేశానుసారం, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ & హెచ్ఓఓఎఫ్) సూచనలతో విధుల్లో పాల్గొంటున్నాం. విధి నిర్వహణలో ఉన్న అటవీ ఉద్యోగుల రక్షణకు ముందుకు వచ్చి, క్షేత్ర స్థాయిలో సహకరిస్తున్న పోలీస్ శాఖకు, డీజీపీకి కృతజ్ఞతలు అని తెలంగాణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ జూనియర్ అటవీ అధికారుల సంఘం పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.


అసలేం జరిగిందంటే..  
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామం ఎర్రబోడులో ప్లాంటేషన్‌ మొక్కలను పోడుభూమి సాగుదారులు నరుకుతుండటంతో వాటిని అడ్డుకునేందుకు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు నవంబర్ 22న తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అయితే మొక్కలను నరకవద్దని గుత్తికోయలను హెచ్చరించడంతో పోడుభూమి చేస్తున్న వారు ఆగ్రహం చెందారు. వారు సహనం  కోల్పోయి ఒక్కసారిగా వేట కొడవళ్లతో ఫారెస్ట్ రేంజ్‌ అధికారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే తోటి సిబ్బంది ఆయన్ను చండ్రుగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. సాగుభూమిదారులు దాడి చేయడంతో తొలిసారిగా రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు మృతి చెందడంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది.