YS Sharmila Padayatra : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ షర్మిల ప్రచార రథానికి టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పుపెట్టారు. పాదయాత్ర వాహనాలపై రాళ్లు రువ్వారు.  అనంతరం వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు తగలబెట్టిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు... షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజక వర్గం చెన్నరావుపేట మండలం జల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. షర్మిల పాదయాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.  రోడ్డుపై షర్మిల ఫ్లెక్సీ లు తగలబెట్టి షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.  షర్మిల పాదయాత్ర చేసే రోడ్డులోనే ఫ్లెక్సీ లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నాయకులు. దీంతో రాజపల్లె గ్రామంలో పోలీస్ బలగాల మోహరించారు. 


భారీ బందోబస్తు మధ్య పాదయాత్ర 


నర్సంపేట నియోజకవర్గంలో ముడో రోజు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. నర్సంపేట మండలం రాజపల్లి నుంచి మొదలైన పాదయాత్ర భారీ బందోబస్తు మధ్య  పాదయాత్ర కొనసాగుతోంది. నిన్న నర్సంపేట పట్టణంలో జరిగిన భారీ బహిరగసభలో నర్సంపేట ఎమ్మెల్యేపై షర్మిల చేసిన కామెంట్స్ కారణంగా దాడులు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాటు చేశారు. 


పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకే


చెన్నారావుపేటలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వైఎస్‌ షర్మిల ప్రచార రథానికి నిప్పుపెట్టారు. మరికొన్ని వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ఆదివారం నర్సంపేట సభలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై వైఎస్‌ షర్మిల చేసిన వ్యాఖ్యలతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై వైఎస్‌ షర్మిల తీవ్రంగా స్పందించారు. దాడిని పిరికిపంద చర్యగా విమర్శించారు. తన పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక టీఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి కుట్రపూరింతంగా స్థానిక ఎమ్మెల్యే ఇలా దాడులు చేయించారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడులతో షర్మిల పాదయాత్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 



నర్సంపేటలో వైఎస్ షర్మిల కామెంట్స్ 


నిన్న నర్సంపేట బహిరంగ సభలో వైఎస్ షర్మిల ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ఒకప్పుడు ట్రాక్టర్ నడిపే నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇప్పుడు రూ.వేల కోట్లకు ఎదిగిండు. భార్యాభర్తలిద్దరూ ఎమ్మెల్యేలట, ఇద్దరూ సంపాదిస్తారట. భూకబ్జాలట, పోస్టింగులకు కమీషన్లట. పంట నష్టపోతే కనీసం సాయం చేయని ఈ ఎమ్మెల్యే ఇక ఉండి ఎందుకు? గురిజాల గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్. ఒక్క పని కూడా చేయలే. నేటికీ వైయస్ఆర్ వేసిన రోడ్లే ఉన్నాయ్. నర్సంపేటకు మిర్చి పరిశోధన కేంద్రం, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ తీసుకొస్తానని మాటలు చెప్పి, మోసం చేసిండు. రాళ్ల వానతో పంట నష్టపోయి.. ఏడాది కావొస్తున్నా నయాపైసా ఇవ్వలేదు. ప్రజలకు సమస్యలే లేవని, అంతా అద్భుతంగా ఉందని చెబుతున్న కేసీఆర్ కు సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ముంటే మాతో పాదయాత్రకు రండి.. సమస్యలు లేవని తేలితే ముక్కు నేలకు రాసి వెనక్కి వెళ్తా. సమస్యలు ఉన్నాయని తేలితే రాజీనామా చేసి, దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తావా?" అని వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. 


కేసీఆర్ ఏంచేశారు ? 


ప్రజలకు సేవ చేయండని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు అధికారమిస్తే ఐటీ, ఈడీ, సిట్ దాడులంటూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజల కోసం ఒక్కరు కూడా ఆలోచన చేయడం లేదన్నారు. ఇరు పార్టీలు కలిసి దొందూ..దొందే అనే సినిమా నడిపిస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. వైఎస్ఆర్  నర్సంపేటలో 65 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నారని, అధికారంలోకి రాగానే రంగయ్య రిజర్వాయర్ తో పాటు పాకాల, ఎస్సారెస్పీ కాలువలు నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని గుర్తుచేశారు. 8 సబ్ స్టేషన్లు, 4 కస్తూర్భా స్కూళ్లు, 30 వేల పక్కా ఇండ్లు నిర్మించారన్నారు. మరి కేసీఆర్ ఏం చేసినట్టు అని ప్రశ్నించారు.