Janagaon Crime News: జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ చేస్తున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు కారణం ఆ యువకుడు ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా ఆట కోసం అప్పులు కూడా చేశాడు. అది తీర్చలేక.. ఇంట్లో వాళ్లకు చెప్పుకోలేక ప్రాణాలు పోగొట్టుకున్నాడు. 


అసలేం జరిగిందంటే..?


జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డి గూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బైరగొని పద్మ - సత్య నారాయణల చిన్న కుమారుడు 21 ఏళ్ల బైరగొని నజీర్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. జిల్లాలోని యశ్వంతపూర్ సీజేఐటీ కళాశాలలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే ఆన్ లైన్ గేమ్స్ కు నజీర్ బాగా అలవాటు పడ్డాడు. ముందు కొంచెం కొంచెంగా డబ్బులు పెట్టి ఆడడం ప్రారంభించాడు. ఆ తర్వాత డబ్బును పెంచుతూ పోయాడు. చాలా వరకు పోగొట్టుకున్నాడు. అయినా ఆన్ లైన్ గేమ్స్ వ్యసనంగా మారడంతో అప్పులు చేసి మరీ ఆట ఆడాడు. దీంతో అప్పులు పెరిగాయి. ఇంట్లో చెప్పడానికి భయపడిపోయాడు. అలా అని అప్పు తీర్చలేకపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ప్రాణాలు తీసుకోవాలి అనుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ద్వారా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


మూడు నెలల క్రితం వరంగల్ లో ఓ యువకుడు బలి


వరంగల్ లో ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ కు ఓ యువకుడి బలి అయ్యాడు. పది లక్షల వరకూ మోసపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు.. నమ్మిన వాళ్లే తనను మోసం చేశారంటూ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం మలక్ పల్లికి చెందిన రామకృష్ణ అనే యువకుడు హన్మకొండలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ లకు అలవాటు పడ్డాడు. అలా ప్రతిరోజూ గేమ్స్ ఆడుతూ దాదాపు 10 లక్షల వరకూ పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామకృష్ణ ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అయితే విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతూ రామకృష్ణ ఈరోజు మృతి చేందాడు. అయితే ఆత్మహత్య చేసుకోబోవడానికి ముందు.. నమ్మిన స్నేహితులే నన్ను మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడి వల్లే తనకు ఆ ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ అలవాటు అయిందని.. అతడి వల్లే తాను ఆత్మహత్య చేసుకునే స్థితి వచ్చిందని వీడియో ద్వారా తెలిపాడు.