Mahabubabad Bomb Blast: వరంగల్ జిల్లా బయ్యారం మండలంలోని కోటగడ్డ సమీప బయ్యారం పెద్దచెరువు కట్టపై బాంబు పేలుడు కలకలం సృష్టిస్తుంది. విశ్వనీయ సమాచారం ప్రకారం.. జిల్లాలోని కురవి మండలం ఊరు గుండ్రాతి మడుగు గ్రామానికి చెందిన బోదంగండ్ల రవి సేప్టన్ గుండ్రాతిమడుగు సమీపంలోని పోలంపల్లి తండా వద్ద ఉన్న రైల్వేగేట్ వద్ద గేట్ మెన్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే చెరువు సమీపంలోని గిరకతాడు కల్లు తాగేందుకు మరో ముగ్గురితో కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. గిరకతాటి కల్లు తాగి ఇంటికి వెళ్లిపోతుండగా.. చెరువు కట్ట సమీపంలో మూత్ర విసర్జనకు చెట్లలోకి వెళ్లాడు. అక్కడే చెట్ల పొదల్లో ప్లాస్టిక్ కవర్ లో ఏదో ఉండటాన్ని గమనించాడు. అందులో ఏం ఉందో చూడాలని ఆత్రుత మొదలుకాగా.. వెంటనే దాన్ని తెరిచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అది విప్పగా ఒక్కసారిగా తీవ్ర శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అతడి రెండు చేతులు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యాయి. కళ్లు కూడా దెబ్బతిన్నాయి. 


ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న యువకుడు


విషయం గుర్తించిన అతడి స్నేహితులు వెంటనే క్షతగాత్రుడిని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం అక్కడ నుంచి హైదరాబాద్ దవాఖానకు తరలించినట్లు సమాచారం. అయితే వారు చెరువులో చేపల వేటకు నాటు బాంబులు వినియోగించే సమయంలో మిస్సై ఈ దుర్ఘటన జరిగిందా లేక నక్సలైట్లు పెట్టిన నాటు బాంబులా అనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సాయంత్రం వేళ బాంబు శబ్దం వినిపించిందని కోటగడ్డ గ్రామస్థులు తీవ్రంగా భయపడిపోతున్నారు. కవర్లో ప్రేలుడు పదార్థం ఉన్నట్లు స్థానికులు భావిస్తున్నారు.


నెల రోజుల క్రితం హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద పేలుడు


హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గల డంపింగ్ యార్డులో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి రోజూ డంపింగ్ యార్డులో 45 ఏళ్ల చంద్రన్న,  ఆయన కుమారుడు 14 ఏళ్ల సురేష్ చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే చెత్త ఏరుతుండగా పడేసి ఉన్న పెయింట్ డబ్బాలను కదిలించారు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తండ్రి చంద్రన్నకు తలకు గాయాలు కాగా.. కుమారుడు సురేష్ కు చేయి విరిగింది. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధారంగా పోలీసులు ఆధారాలు సేకరించారు. 


ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా గాంధీ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి తదితరులు పరిశీలించారు. ఈ మేరకు అన్ స్పెక్టర్ మోహన్ రావు కేసు నమోదు చేశారు.