Warangal News: కాకతీయులు పాలించిన సామ్రాజ్యంతోపాటు తెలంగాణకు గెట్‌వేగా మారింది కాకతీయ కళాతోరణం. కాకతీయుల రాజధాని వరంగల్ కోట శిల్పసంపద, చారిత్రక కట్టడాలతో పర్యాటక ప్రాంతంగా కొనసాగుతుంది. వరంగల్ కోటలో అనేక చారిత్రక కట్టడాలు ఢిల్లీ సుల్తాన్‌ల దాడుల్లో ధ్వంసమై నేలమట్టమయ్యాయి. కానీ కాకతీయుల స్వయంభూ దేవాలయానికి నాలుగు ద్వారాల ప్రారంభంలో నిర్మించిన కాకతీయ కళాతోరణాలు మాత్రం సుల్తానుల దాడుల్లో చెక్కు చెదరలేదు.
తెలంగాణ రాష్ట్రంలో, వరంగల్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా, కాకతీయ సామ్రాజ్యం వైభవానికి నిదర్శనంగా వరంగల్ కోట నిలిచింది. క్రీ.శ 750 నుంచి 1323 వరకు కాకతీయుల సామ్రాజ్యం కొనసాగింది. దక్షిణ భారత దేశంలో అధిక భాగాన్ని పాలించిన కాకతీయుల హనుమకొండ, వరంగల్‌ను రాజధానిగా చేసుకొని పాలించారు. వరంగల్ రాజధానిగా చేసుకొని కాకతీయ రాజులు వారికి శక్తి సామర్థ్యాలను చాటుకోవడంతో పాటు, శత్రువుల నుంచి రక్షించుకోవడానికి భారీ కోట నిర్మించారు. గణపతి దేవుడి కాలంలో కోటను మరింత విస్తరించినట్లు చరిత్రకారులు చెబుతారు. కాకతీయులు శివ భక్తులు కావడంతో కోట ఆవరణలో స్వయంభు ఆలయంతోపాటు మరి కొన్ని ఆలయాలు నిర్మించారు. ఈ ప్రాంగణాన్ని స్వయంభూ దేవాలయ ప్రాంగణంగా పిలిచారు. ఈ ప్రాంగణానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షణం నాలుగు దిశలలో కాకతీయ కళాతోరణంగా పిలిచే నాలుగు అలంకార ద్వారాలు 80 అడుగుల ఎత్తుతో రాతి తో నిర్మించారు.
రాజధాని.... నిర్మాణం.
వరంగల్ కోటపై ప్రతాపరుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తాన్లు పదే పదే దండయాత్రలు చేశారు. ప్రతాపరుద్రుడిని బంధీగా చేసుకున్నారు. దీంతో వరంగల్ కోటను, ప్రధానంగా ఆలయాలను ధ్వంసం చేశారు. దేవాలయాలను శిల్ప సంపదను నేలమట్టం చేశారు. అయితే నాలుగు దిక్కుల నిర్మించిన కళాతోరణాలుగా పిలుచుకునే ద్వారాలు మాత్రం అలానే ఉండిపోయాయి. కళతోరణంపై చెక్కిన్న రూపాలు, కాకతీయుల పాలన వైభవానికి నిదర్శనమని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. తోరణానికి ఇరువైపుల గర్జించే సింహాలు, పైభాగంలో మొసలి, ఏనుగును పోలిన శిల్పాలు, తోరణం చివరలో రెండు వైపులా హంసలు కనిపిస్తాయి. ఈ కళాతోరణాలు మాత్రం ఢిల్లీ సుల్తాన్ల దాడులకు సాక్ష్యంగా నిలిచాయి.
సుల్తాన్‌ల లక్ష్యం హిందూ దేవాలయాలు కాబట్టి మొదట దేవాలయాలను ధ్వంసం చేసి ఆపై శిల్ప సంపదని నాశనం చేశారని చరిత్రకారులు చెబుతున్నారు. తోరణాలపై హిందూ మతానికి సంబంధించిన గుర్తులు, దేవతామూర్తుల విగ్రహాలు లేవు కాబట్టి సుల్తానులు వీటిని ముట్టుకొక పోవచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
ద్వారమే.. కాకతీయ సామ్రాజ్యానికి ఐకాన్ గా మారింది
ఈ తోరణాలను చూడగానే కాకతీయ సామ్రాజ్యం, రుద్రమదేవి గుర్తుకు వస్తుంది. దక్షిణ భారతదేశంలో కాకతీయ సామ్రాజ్యానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కాకతీయుల రాజధాని వరంగల్ కోటలో తోరణాలు ధ్వంసం కాకుండా ఉండడంతో కాకతీయులకు చిహ్నంగా మారాయి. నాలుగు ద్వారాలను గెట్ వేగా కాకతీయులు వీటిని నిర్మించిన కాలక్రమేణా కాకతీయ కళాతోరణంగా, కీర్తితోరణంగా భావిస్తున్నారు. ఈ తోరణమే పర్యాటకులను ఆకర్షిస్తుంది. కోటలో కాకతీయులు నిర్మించిన ఆలయాలు, శిల్ప సంపద ధ్వంసం కాగా తోరణాలు కాకతీయుల కళ నైపుణ్యం, టెక్నాలజీకి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాకతీయ కీర్తితోరణాన్ని వారి సామ్రాజ్యం విసరించిన ప్రతి చోట నిర్మించారు.
Also Read: డాక్టర్ పిలిస్తే క్యూ కడుతున్న చిలుకలు