Telangana News తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ వేదికగా తొలి సభ జరగనుంది. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ సభలో నిర్వహిస్తారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలు కూడా పాల్గొనే ఛాన్స్ ఉందని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండు రోజుల్లో అక్కడ ప్రచారం ముగియనుంది. అలా ప్రచారం ముగిసన వెంనేట హన్మకొండ చేరుకుంటారు.
సంవత్సరంలో కాంగ్రెస్ చేపట్టిన పథకాలు, ప్రజలకు చేసిన మేలు, సాధించిన విజయాలు, ప్రజలకు పంచిన నిధులు ఇలా ప్రతి అంశంపై ఈ సభలో మాట్లాడతారు. విజయోత్సవ సభల్లోనే కొన్ని పథకాలను కూడా ప్రభుత్వం ప్రారంభించబోతోందని తెలుస్తోంది. హన్మకొండ వేదికగా జరిగే సభలో 22 జిల్లాల ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు.
అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరి ప్రశంసలు అందుకుంటుందన్నారు అటవీశాఖ మంత్రి కొండా సురేఖ. 19న జరిగే మీటింగ్‌కు భారీగా జనం తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటురన్నారని దానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
వరంగల్ డిక్లరేషన్‌లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు దిశగా వెళ్తోందని అన్నారు. ముఖ్యంగా మహిళలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టు వెల్లడించారు. అందుకే ఇందిరమ్మ జయంతి రోజున వరంగల్‌లో సభ పెడుతున్నామని తెలిపారు.