Balagam Fame Mogilaiah: చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అందుకున్న మూవీ 'బలగం'. ఈ సినిమా చాలా మందిని ఏడిపించడానికి కారణం క్లైమాక్స్ లో వచ్చే బుడగజంగాల కళాకారుల పాట. వారి గానంతో క్లైమాక్స్ ను పండించడంతోపాటు సినిమా చూసే వాళ్లను ఏడిపించారు. పస్తం మొగిలయ్య, కొమురమ్మ వారి గానంతో అందరినీ ఆకట్టుకున్నారు. కాగా, పస్తం మొగిలయ్య కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కొద్దిరోజులుగా వరంగల్ సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళ డయాలసిస్ నిర్వహిస్తుండగా, మొగిలయ్యకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దాంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటినా హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం మొగిలయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన పస్తం మొగిలయ్య రెండేళ్ల క్రితం కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత కిడ్నీల సమస్య వచ్చి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. షుగర్, బీపీ పెరగడంతో కంటి చూపు కూడా దెబ్బతింది. కొంత కాలం క్రితం చేయి కూడా విరిగింది. ప్రస్తుతం ఆయన వరంగల్ సంరక్ష ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ చేయించుకుంటున్నారు. అందులో భాగంగా రక్తం ఎక్కించేందుకు శరీరంపై 11 చోట్ల రంధ్రాలు చేయాల్సి వచ్చింది. ఛాతీ వద్ద చేసిన రంధ్ర ద్వారా రక్తం ఎక్కిస్తుండగా గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బుర్రకథలు చెప్పుకుంటూ పొట్ట నింపుకునే వారు. బలగం సినిమాలో క్లైమాక్స్ కోసం వేణు ఎల్దండి వారితో సాంగ్ పాడించాడు. 'తోడుగా మాతోడుండి.. నీడగా మాతో నడిచి..' అంటూ సాగే పాటతో మొగిలయ్య, కొమురమ్మ దంపతులు కన్నీళ్లు పెట్టించారు.
బలగం సినిమాకు క్లైమాక్స్ చాలా కీలకం. దాదాపు 15 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ సీన్ లో ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా ఉండదు. కేవలం మొగిలయ్య, కొమురమ్మ పాటతో క్లైమాక్స్ మొత్తాన్ని నడిపించాడు దర్శకుడు. కొమురయ్య తమతోపాటు పాడిస్తున్నాడంటూ పేరు పేరునా కుటుంబసభ్యుల గురించి చెబుతూ ఈ పాట సాగుతుంది. కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడి గురించి చెబుతూ పాట సాగే తీరుకు సినిమా చూసే వాళ్లు కన్నీరు పెట్టాల్సిందే.
జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి మొదటిసారి దర్శకత్వం వహించిన సినిమా బలగం. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ బలగం సినిమాను తెరకెక్కించాడు వేణు. పిట్ట ముట్టుడు ఆచారం చుట్టూ ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఎప్పుడూ లేని కొత్త సాంప్రదాయానికి కూడా ఈ సినిమా తెరలేపింది. ఇంట్లో ఒక్కరు ఈ సినిమా చూస్తే ఇంటిల్లిపాదికి ఈ మూవీని చూపిస్తున్నారు. అలాగే ఊళ్లో రచ్చబండల వద్ద, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి మరీ బలగం సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా చూస్తూ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఓటీటీలోకి వచ్చినప్పటికీ, ఊరూరా, ఊరంతా కలిసి సినిమా చూస్తున్నప్పటికీ థియేటర్లలో కూడా బలగం సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.