ప్రభుత్వ ఉద్యోగుల సెల్‌ఫోన్ డౌన్ నిరసన
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులంతా వినూత్న నిరనస చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలన్న డిమాండ్‌తో కొన్ని రోజుల నుంచి వివిధ మార్గాల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ(ఏప్రిల్‌11 మంగళవారం) సెల్‌ఫోన్‌ డౌన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఏపీజేఏసీ అమరావతి పిలుపు మేరకు ఉద్యోగులంతా ఈ ఒక్కరోజు సెల్‌ఫోన్‌ వాడకుండా తమ నిరసన తెలియజేస్తారు. బుధవారం అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయనున్నారు. మలి దశ ఉద్యమంలో భాగంగా పలు విధంగాలు తమ డిమాండ్లు వినిపించాలని ఉద్యోగులు నిర్ణయించారు. 


తెలంగాణలో నేటి నుంచి ధాన్యం కొనుగోలు
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు సీఎం, మంత్రులు ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. ఆరబెట్టిన ధాన్నాన్ని మాత్రమే రైతులు తీసుకురావాలని సూచించారు. 


ఎస్ఎస్సీ కేసులో నేడు విచారణ 
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఏ 1గా ఉన్న బండి సంజయ్‌ రిమాండ్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అదే టైంలో బెయిల్‌పై కూడా విచారణ జరగనుంది. ఆయనతోపాటు నిందితులుగా ఉన్న వారి బెయిల్‌ విషయంలో విచారణ జరగనుంది. పదోతరగతి పరీక్ష పేపర్ లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఏ1గా పేర్కొంటు తెలంగాాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను గత వారంలో అరెస్టు చేశారు. తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే రిమాండ్‌ విషయంలో ఇవాళ విచారణ జరగనుంది. రిమాండ్‌ను రద్దు చేస్తారా లేకుంటే కొనసాగిస్తారా అనేది నేడు తేలనుంది. 


వివేక హత్య కేసులో నేడు కీలక విచారణ
వివేక హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి విషయంలో అవినాష్ తండ్రి భాస్కర్‌రెడ్డి, వివేక పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై నేడు విచారించనుంది కోర్టు. ఆయనకు కింది కోర్టు క్షమాభిక్ష పెట్టడాన్ని వీళ్లిద్దరూ సవాల్ చేశారు. అభ్యంతరం చెబుతూ తెలంగాణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. 


నేడు జూపల్లి కృష్ణారావు కీలక భేటీ 
బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు తన అనుచరులతో సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు. ఏ పార్టీలో చేరాలి... ఏ పార్టీల నుంచి పిలుపు వచ్చింది. అనే విషయాలను అనుచరులతో మాట్లాడనున్నారు. ఈయనతోపాటు పొంగులేట శ్రీనివాస్ రెడ్డిని సోమవారం బీఆర్‌ఎస్ బహిష్కరించింది. అందుకే ఆయన తన అనుచరులతో భేటీ అయ్యి ఏం చేయాలనే విషయంపై డిస్కస్ చేయనున్నారు. 


నేడు ఐపిఎల్‌లో బోణి కోసం రెండు జట్ల పోరు 
ఐపీఎల్‌-2023లో ఇంకా ఖాతా తెరవని రెండు జట్లు నేడు పోటీ పడనున్నాయి. ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు సాగనుంది. ఇప్పటి ఢిల్లీ మూడు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో కూడా ఓడిపోయింది. ముంబై ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. అందుకే ఈ మ్యాచ్‌పై ఆసక్తి ఏర్పడింది.