86 members of the banned CPI Maoist surrendered | కొత్తగూడెం: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీసుల ఎదుట లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) పోలీసుల ఎదుట 86 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోయారు. పోలీసు బెటాలియన్ ఆఫీసులో కొత్తగూడెం మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 86 మావోయిస్టులు లొంగిపోగా,. వీరిలో 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఏసీఎం సభ్యులకు అయితే ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పుల అందిస్తాం. పార్టీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున అందిస్తామని స్పష్టం చేశారు.
మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా సీపీఐ మావోయిస్టుకు చెందిన 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ‘ఆపరేషన్ చేయూత’ కార్యక్రమంలో భాగంగా మావోయిస్టులు లొంగిపోయారు. వీరికి తక్షణ సాయం కింద రూ. 25 వేలు అందజేయనున్నాం. ఆపరేషన్ చేయూతలో భాగంగా ఇప్పటివరకూ 224 మంది సరెండర్ అయ్యారు. వీరిలో ఇద్దరు డీవీసీఎంలు, 10 మంది ఏసీఎంలు, పీపీసీఎంలు, 25 మంది పార్టీ సభ్యులు, 74 మిలీషియా సభ్యులు, 23 ఆర్పీసీ సభ్యులు, 41 మంది డీకేఎంఎస్, ఏఎంఎస్ సభ్యులు, 31 సీఎన్ఎం సభ్యులు, 17 జీఆర్‌డీలు, ఒక కొరియర్ ఉన్నారు.
మార్చిలో 64 మంది మావోయిస్టులు లొంగుబాటు
గత నెలలో 64 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారు. తాజాగా మరోసారి భారీ సంఖ్యలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు రావడం శుభపరిణామం. మావోయిస్టు పార్టీ లక్ష్యాలు, సిద్ధాంతాలను వదిలిపెట్టి మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఛత్తీస్ గఢ్ లో వరుస ఎన్ కౌంటర్లలో భారీగా మావోయిస్టులు చనిపోతున్నారు. దాంతో సరెండర్ అవుతున్న మావోయిస్టుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్ కొనసాగుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టు రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఇటీవల 12 నుంచి 6కి తగ్గినట్లు ప్రకటించారు.