Pawan Kalyans Bhadrachalam visit | భద్రాచలం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు అయింది. ఏప్రిల్  6వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని ఒక ప్రోటోకాల్ షెడ్యూల్ విడుదల చేశారు. కానీ అనివార్య కారణాలతో పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ మేరకు అధికారులు మరో శనివారం ఉదయం మరో ప్రకటనలో పవన్ పర్యటన రద్దు విషయాన్ని వెల్లడించారు. 

తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం రాత్రికి భద్రాచలం చేరుకోవాల్సి ఉంది. ఏప్రిల్ 6న సీతారాముల కళ్యాణంలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అనివార్య కారణాలతో భద్రాచలంలో పవన్ కళ్యాణ్ రద్దు అయినట్లు ఇంటెలిజెన్స్ డీజీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు రావడంతో ఆయన అభిమానులు, జనసైనికులు నిరాశకు లోనవుతున్నారు.

 

శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని మిథిలా స్టేడియంలో రాములోరి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి మొదట పవన్ కల్యాణ్ హాజరై స్వామి, అమ్మవారి కళ్యాణ వేడుకను వీక్షించాలనుకున్నారు. శనివారం భద్రాచలం చేరుకుని రాత్రికి అక్కడే బస చేయాలని పవన్ భావించారు. ఆదివారం జరిగే కళ్యాణ వేడుకల అనంతరం సాయంత్రం వరకు పవన్ కల్యాణ్ భద్రాచలంలోనే ఉండనున్నారని అధికారులు ప్రొటోకాల్ ఏర్పాట్లు సైతం చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో బయలుదేరి ఆదివారం రాత్రి 10 గంటలకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకుంటారని జనసేన నేతలు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ ఉండటంతో ఆ మేరకు సెక్యూరిటీ ఏర్పాట్లు సైతం చేయాలని తెలంగాణ డీజీ శుక్రవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు చేసుకోవడంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ మరో ప్రకటన విడుదల చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం భద్రాచలం పర్యటన రద్దు అయినట్లు స్పష్టం చేశారు.

పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డిభద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, తదితరులు హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారులు సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాములోరి కళ్యాణ వేడుకల సందర్భంగా భద్రాచలం వస్తున్నారని జిల్లా అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.