Bhatti Vikramarka : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి చేరుకుంది. త‌మ క‌ష్టాలు, బాధ‌లు తెసుకునేందుకు ఒక్కసారి కాకతీయ యూనివ‌ర్సిటీకి రావాల‌ని విద్యార్థులు భట్టిని ఆహ్వానించారు. విద్యార్థుల ఆహ్వానం మేర‌కు వారి ఇబ్బందులు ప్రత్యక్షంగా వారితో మాట్లాడి తెలుసుకునేందుకు యూనివ‌ర్సిటీకి భ‌ట్టి విక్రమార్క వెళ్లారు. యూనివ‌ర్సిటీల ప్రైవేటీక‌ర‌ణ‌, పేప‌ర్ల లీకేజీ, రిజ‌ర్వేష‌న్ల ఇబ్బందుల‌ను స‌మ‌స్యల‌ను సీఎల్పీ నేత దృష్టికి విద్యార్థులు తీసుకువ‌చ్చారు. సూర్యపేట‌కు చెందిన రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల్సిందే.. వారి కోటా వారికి ఇవ్వాల్సిందే. అదే విధానాన్ని చ‌ట్టస‌భ‌ల్లో కూడా కేసీఆర్ అమ‌లు చేయాల‌ని చెప్పారు. 


రాష్ట్రపతికి లేఖ 


 సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కాక‌తీయ యూనివ‌ర్సిటీ ఒక పెద్ద వ‌ర్సిటీగా, ఎన్నో ఉద్యమాల‌కు, భావ‌జాలాల‌కు, సామాజిక మార్పుల‌కు వేదిక‌గా నిలిచిందన్నారు. ఇలాంటి ప్రాంతంలో నిల‌బ‌డి మాట్లాడడం ఒక అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ‌లో ఇలాంటి రోజు వ‌స్తుంద‌ని ఊహించ‌లేదన్నారు. ఇలాంటి రోజు రావ‌ద్దనే అప్పుడు సోనియ‌మ్మ తెలంగాణ ఇచ్చిందన్నారు. రాష్ట్ర సంప‌ద నాలుగు కోట్ల మందికి పంచి, ప్రతి ఒక్కరూ ఆత్మ గౌర‌వంతో జీవించాల‌ని సోనియ‌మ్మ ఆలోచ‌న చేసిందన్నారు. స‌క‌ల స‌మస్యల‌కు ప‌రిష్కారం తెలంగాణ ఏర్పాటు మాత్రమే అనుకున్నామన్నారు. కానీ ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే ఇప్పుడే స‌మ‌స్యలు, ఇబ్బందులు ఎక్కువ‌గా ఉన్నాయన్నారు. పేపర్ల లీకేజ వ్యవహారంపై స్పందించిన ఆయన.. ఈ విషయంపై రాష్ట్రపతి లేఖ రాస్తామన్నారు. టీఎస్పీఎస్సీని రద్దుచేయాలని కోరుతామన్నారు. 


బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో కోపం 


"నేను పాద‌యాత్రగా న‌డిచి వ‌చ్చిన ప్రతి గ్రామంలో ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్ర ఆశ‌లు, ఆకాంక్షలు నెర‌వేర‌లేదు. ఈ ప్రభుత్వాన్ని వ‌దిలించుకోవాల‌న్న కోపం, బాధ ప్రజ‌ల్లో స్పష్టంగా కనిపించింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ‌మంతా భూమి కోసం, భుక్తి కోసం.. విముక్తి కోస‌మే సాగింది. దేశ‌మంతా స్వాతంత్ర పోరాటం సాగుతున్న స‌మ‌యంలో హైద‌రాబాద్ ప్రాంతంలో భూమి కోసం పోరాటం చేశాం. దున్నేవాడిదే భూమి అంటూ భూ ఉద్యమాలు చేశాం. దేశానికి స్వాతంత్రం వ‌చ్చిన ఏడాదికి అంటే 17 సెప్టెంబర్ 1948లో మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ రోజుల్లో ఉత్పాద‌క‌త అంతా భూమి మీదే. ఆ భూమి కొద్దిమంది చేతుల్లో ఉంది.. బానిస‌త్వం, వెట్టిచాకిరి ఉండేది. దీంతో తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం జ‌రిగింది. త‌రువాత వ‌చ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు టెన్నెన్సీ యాక్ట్ తీసుకువ‌చ్చి పేద‌ల‌కు భూమిపై హ‌క్కును క‌ల్పించింది. త‌రువాత భూ సంస్కర‌ణ‌లు అమ‌లు చేసి భూ పంపిణీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పటికీ తృప్తి చెందని తెలంగాణ స‌మాజం తొలిద‌శ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేసింది. ఆ స‌మ‌యంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రిపై న‌క్సలైట్లు దాడులు చేశారు. త‌రువాత వ‌చ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డా. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో వారితో చ‌ర్చలు జరిపి.. కోనేరు రంగారావు క‌మిటీని నియ‌మించింది. ఆ క‌మిటీ ఇచ్చిన సిఫార్సుల‌ను అమ‌లు చేసి.. మరింత సమర్థవంతంగా భూ పంపిణీ చేసింది." - భట్టి విక్రమార్క  


70 ఏళ్లు వెనక్కి 


 మా రాష్ట్రం మాకొస్తే మా నీళ్లు, నీధులు, నియామ‌కాలు, ఆత్మ గౌర‌వం వ‌స్తుంద‌న్న ఆలోచ‌న‌తో మ‌లిద‌శ తెలంగాణ ఉద్యమం వ‌చ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు. దీనిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గౌర‌వించిందని, సోనియాగాంధీ నాయ‌కత్వంలో ఏపీ రీ ఆర్గనైజేష‌న్ యాక్ట్ ద్వారా తెలంగాణను ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన ప్రతి ఉద్యమానికి చ‌ట్టబ‌ద్ధ ఫ‌లితాలు వ‌చ్చాయన్నారు. ఒక్క తెలంగాణ ఏర్పాటు విష‌యంలో మాత్రం.. ప్రజ‌లు 70 నుంచి 80 ఏళ్ల వెన‌క్కి నెట్టివేయ‌బ‌డ్డారన్నారు. ధ‌ర‌ణి పేరుతో... కాంగ్రెస్ పంచిన భూముల‌ను కేసీఆర్ ప్రభుత్వం వెన‌క్కి తీసుకుందని ఆరోపించారు. నీళ్లు లేవు.. నిధులు లేవు.. నియ‌మకాలు లేకుండా చేశారన్నారు. తెలంగాణ‌కు సింగ‌రేణి ఉద్యోగాల గ‌ని.. ఉమ్మడి రాష్ట్రంలోనే ల‌క్ష 20 వేల ఉద్యోగాలున్న సింగ‌రేణిలో ప్రస్తుతం 42 వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయన్నారు. బొగ్గుగ‌నులు ప్రైవేటుకు ఇవ్వడం, అక్కడ కూడా అవుట్ సోర్సింగ్ లో బ‌య‌టి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడంతో స్థానికుల‌కు ఉద్యోగాలు లేకుండా పోయాయన్నారు.