తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లు జరపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ టీ-కాంగ్రెస్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన రెండు రోజుల వరి దీక్షకు కాంగ్రెస్ సీనియర్లంతా హాజరయ్యారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించడాన్ని తప్పుపడుతూ ఇన్ని రోజులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆయనతో పాటు ఇతర సీనియర్లు కూడా అంటీ ముట్టనట్లుగా ఉన్నారు. వారంతా ఇందిరాపార్క్ వద్ద దీక్షలో కలిసి మెలిసి కనిపించారు. దీక్ష చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని మోసం చేస్తున్నాయని తక్షణం వారి నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ వరి రైతులకు ఉరి వేస్తున్నారని మండిపడ్డారు. గుండు, అరగుండు మనకు పంగనామాలు పెడుతున్నారు. పార్లమెంట్‌లో నరేంద్రమోడీ చొక్కా పట్టి.. నాలుగు గుద్ది అయినా సరే ధాన్యం కొనుగోలు చేయిస్తామని హెచ్చరించారు. మేమందరం ధర్నా చౌక్‌లో పడుకుంటామని.. ఎందుకు ధాన్యం కొనరో చూస్తామని హెచ్చరించారు. ధాన్యం కొనకపోతే కేసీఆర్ గద్దె దిగాల్సిందేనని స్పష్టం చేశారు.
మోడీ, కెసిఆర్ లు కలిసి రైతులను మోసం చేస్తున్నారని పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేంద్రం 40 లక్షల టన్నుల బియ్యం సేకరణకు టార్గెట్ పెట్టిందని..కానీ ఇప్పటి వరకు 8 లక్షల టన్నులు కూడా సేకరించలేదని ఆరోపించారు. పంజాబ్ లో ఇప్పటికే కోటి 10లక్షల టన్నులు కేంద్రం సేకరించిందని..మన కంటే చిన్న రాష్ట్రాలు కూడా 40 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరిస్తున్నాయన్నారు. వరి రైతులు నష్ట పోడానికి కెసిఆరే కారణమని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల్లో వరి రైతుల కోసం పోరాటం చేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు.
Also Read : సీఎం కేసీఆర్ ఓ హంతకుడు..! వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు, కవిత టార్గెట్‌గా ట్వీట్
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ గా రైతులను కాపాడుకోవాల్సిన భాధ్యత కాంగ్రెస్ పార్టీ పై ఉందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోలు ను పక్కన పెట్టి. యాసంగి పంట గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు మానవత్వం లేదు.. డబ్బు సంపాదించడమే ద్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నాలుక కోసినా తప్పులేదని..అబద్దాలతో కేసీఆర్ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. అవసరం లేని కొత్త సెక్రటేరియట్ కడుతున్న కేసీఆర్.. ఇప్పుడు ఆ డబ్బులు రైతు లకు ఉపయోగపడేవి కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ లా ఢిల్లీ వెళ్లి ఇంట్లో పడుకోం...ప్రధాని ఆఫీసు ముందు కూర్చుంటంమని కోమటిరెడ్డి ప్రకటించారు.
Also Read: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
ఈ వరి దీక్షలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరూ పాల్గొనడం ఆ పార్టీ క్యాడర్‌లో జోష్ నింపింది. హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత రేవంత్ రెడ్డిని సీనియర్లు టార్గెట్ చేశారు. తానేంటో చూపిస్తానని సవాల్ చేసిన వెంకటరెడ్డి కూడా ఇప్పుడు మనసు మార్చుకున్నారు. వరి దీక్షలో ఆయన హావభావాలు చూస్తే రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేయడానికి సిద్ధమైనట్లేనన్న అభిప్రాయానికి అందరూ వస్తున్నారు. అందరూ చేతులు కలిపితే కాంగ్రెస్‌కు ఎదురుండదని క్యాడర్ నమ్ముతున్నారు.
Also Read: Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !