Union Minister Bandi Sanjay | హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా నవంబర్ 26న అన్ని గ్రామ పంచాయతీల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సర్క్యూలర్ జారీ చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.
90 శాతం నిధులు కేంద్రానివే..
గ్రామాల్లో కొనసాగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులకుప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమే 90 శాతం నిధులిస్తోందనీ చెప్పారు. గ్రామాల్లోని మొక్కల పెంపకం, రైతు వేదికలు, రోడ్ల నిర్మాణం, వైకుంఠధామాలు కేంద్రం ఇస్తోన్న ఉపాధి హామీ పథకం నిధులతో జరుగుతున్నవేనని తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అవి తమవని చెప్పుకుంటూ ప్రజా పాలనా విజయోత్సవాల పేరుతో ఉపాధి పనులు ప్రారంభించాలని ఉత్తర్వులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. సొమ్ము కేంద్రానిదైతే, సోకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నట్లుగా కాంగ్రెస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిందేమీ లేదన్న కారణంగా కేంద్ర నిధులతో అమలవుతున్న ఉపాధి పనులను తమ పాలన విజయోత్సవాలుగా ప్రారంభించుకోవడం సిగ్గు చేటు అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఉపాధి కూలీలకు సమున్నత లబ్ది చేకూరుతోందన్నారు. యూపీఏ పాలనలో గ్రామీణ పేదలకు ఉపాధి దూరమైతే.. ఎన్‌డీఏ (NDA) పాలనలో కోట్లాది మందికి వరంగా మారిందన్నారు. గత 10 ఏళ్లలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద తెలంగాణలోనే దాదాపు రూ.30 వేల కోట్ల మేరకు కేటాయించి పేదలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వం మోదీ సర్కార్ అన్నారు. ఇంత గొప్ప పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకునేలా గొప్పగా ప్రకటనలు చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ పథకం పనుల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నింటికీ ప్రధాని మోదీ ఫొటో తప్పనిసరిగా ఉండేలా సర్క్యులర్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ నిజాయితీని నిరూపించుకోవాలనీ బండి సంజయ్ హితవు పలికారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజాక్షేత్రంలో అడుగడుగునా ఎండగడతామని హెచ్చరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ పాలనకు త్వరలో ఏడాది పూర్తి
తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ గత ఏడాది డిసెంబర్ లో అధికారంలోకి వచ్చింది. తమ ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. దాదాపు మూడు వారాలపాటు ఈ విజయోత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వహిస్తోంది. ఇదివరకే పలు జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ 30న మహబూబ్ నగర్ లో రైతులకు సంబంధించి కార్యక్రమం చేపట్టారు. డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించేలా విజయోత్సవాలు నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Also Read: Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ