TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణఆ సంస్థ(TSRTC) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. టికెట్ ధరలపై 10 శాతం రాయితీ కల్పించనుంది. హైదరాబాద్-విజయవాడ రూట్ లో ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం డిస్కౌంట్ కల్పించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్ - విజయవాడ రూట్ లో నడిచే సూపర్ లగ్జరీ, రాజధాని సర్వీసుల్లో రాను పోనూ ఈ రాయితీ వర్తించనుంది. ఈ నెల 30 వరకు 10 శాతం డిస్కౌంట్ అమల్లో ఉంటుంది. హైదరాబాద్ నుండి విజయవాడ, విజయవాడ నుండి హైదరాబాద్ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తించనుంది. 


ఈ నెలలో విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పరీక్షలు పూర్తి కావడంతో సొంతూర్లకు వెళ్ల వారు ఎక్కువగా ఉంటారు. వారిపై ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. విజయవాడ వరకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. ఆపై ఎలాంటి రాయితీలు వర్తించవు. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లాలలనుకునే వారికి, విజయవాడ వరకు మాత్రమే 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. అక్కడి నుండి విశాఖపట్నం వెళ్లే వారికి ఎలాంటి రాయితీలు వర్తించవు. ఈ నిర్ణయం వల్ల ఒక్కో ప్రయాణికుడిపై రూ. 40 నుండి రూ. 50 వరకు ఆదా అవుతుందని టీఎస్ఆర్టీసీ చెబుతోంది. ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. బస్ టికెట్ల రిజర్వేషన్ల కోసం అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.com ను సంప్రదించాలని వారు సూచించారు.


ముందస్తు రిజర్వేషన్లు చేసుకునే వారికి కూడా టీఎస్ఆర్టీసీ ఆ రాయితీ కల్పిస్తోందని సజ్జనార్ తెలిపారు. 31 నుండి 44 రోజుల మధ్యలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే 5 శాతం, 45 నుండి 60 రోజుల మధ్యలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే 10 శాతం రాయితీని కల్పించనున్నట్లు వెల్లడించారు. 


వచ్చేస్తున్నాయి డబుల్ డెక్కర్ బస్సులు:


హైదరాబాద్ వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డబుల్ డెక్కర్ బస్సులు మరికొన్ని రోజుల్లో రాజధాని రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. మరో 5 నెలల్లో 10 డబుల్ డెక్కర్ ఏసీ బస్సులు నడవనున్నాయి. ఆగస్టు నుండి సెప్టెంబర్ మధ్యలో 5 బస్సులు, ఈ ఏడాది చివరలో మరో 5 డబుల్ డెక్కర్ బస్సులు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ డబుల్ డెక్కర్ బస్సుల కోసం ప్రధాన రహదారులను ఇప్పటికే విస్తరించారు. 


డబుల్ డెక్కర్ బస్సులను యూటర్న్ లేని మార్గాల్లోనే తిప్పనున్నారు. ముందుగా పటాన్ చెరు(218), కోఠి(222) మార్గాల్లో 5 చొప్పున డబుల్ డెక్కర్ బస్సులు నడపాలని నిర్ణయించారు. ఎల్బీనగర్-మియాపూర్ వరకూ మెట్రో అందుబాటులో ఉన్నప్పటికీ బస్సుల్లో 80 శాతం ఆక్యుపెన్సీ ఉంటోంది.


కోఠి, లక్డీకపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, ఆల్విన్ చౌరస్తా, లింగం పల్లి మార్గంలో నుండి 222 రూటు బస్సులకు కూడా ఎప్పుడూ నిండిపోయి ప్రయాణిస్తుంటాయి. గతంలో ఈ మార్గాల్లో మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు నడిచేవి. ఇప్పుడు ఈ రెండు మార్గాల్లోనే మొదటగా డబుల్ డెక్కర్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.