దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీలు ఆర్థికంగా బలపడాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ బీసీ బందు పథకాన్ని తీసుకువచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్సీ కవితతో శనివారం సమావేశమై బీసీ అంశాలపై చర్చలు జరిపారు. చట్టసభల్లో బీసీ మహిళలకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు కులగణన చేపట్టాలన్న డిమాండ్‌తో ఈ నెల 26న జల విహార్‌లో బీసీ సంఘాలు నిర్వహించ తలపెట్టిన సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీసీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. కుల వృత్తులకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా రాయితీలు ప్రోత్సాహకాలను అందిస్తూ వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతుందని కవిత పేర్కొన్నారు. బీసీ వర్గాల్లో అత్యంత వెనుకబడిన కులాల వారిని కూడా ప్రభుత్వం విస్మరించడం లేదని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల్లో, పార్టీ పదవుల్లో అత్యంత వెనుకబడిన కులాల వారికి కేసీఆర్ అవకాశాలు కల్పించి చరిత్ర సృష్టించారని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న బిల్లుపై తీర్మానం చేశామని గుర్తు చేశారు. బీసీల పట్ల తమ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నదని, బీసీలకు రావాల్సిన వాటా, హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమానికి తమ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. జీవితాంతం బీసీల కోసం పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యను ఆమె అభినందించారు.


తెలంగాణ నుంచే శంఖారావం: ఆర్‌ కృష్ణయ్య


బీసీ ఉద్యమానికి తెలంగాణ నుంచే శంఖారావం పూరిస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. దేశంలో పక్షులు, జంతువులకు లెక్కలు కడుతున్న మోడీ సర్కారు బీసీ జన గణన చేయకపోవడం సరికాదన్నారు. బీసీ గణన చేపట్టి రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని క్రిష్ణయ్య డిమాండ్ చేసారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని వెల్లడించారు .


అధికారంలోకి వచ్చాక అప్పటి కేంద్ర హోంమంత్రి, ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బీసీగణన చేస్తామని పార్లమెంట్‌లో ప్రకటించి నేడు మాట మారుస్తున్నారని కృష్ణయ్య ఆరోపించారు. బీజేపీ అవలంభిస్తున్న ద్వంద విధానాన్ని పార్లమెంట్‌లో ఎండగతామని చెప్పారు. బీసీల న్యాయమైన డిమాండ్ల కోసం బీసీ సంఘాలు పోరాడుతున్నాయ వెల్లడించారు. బీసీ సంఘాల పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని మిగతా పార్టీల నేతలంతా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. బీసీగణనతో పాటు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ క్రిమిలేయర్ ఎత్తివేత, తదితర డిమాండ్లపై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జాతీయస్థాయిలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేస్తామని, ఈ అంశాలపై పార్లమెంట్‌లో ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.


తాము చేపట్టే ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సంపూర్ణ సహకారం, మద్దతును ప్రకటించారని తెలిపారు. దశాబ్దాలుగా ఎదురు చూసిన మహిళా బిల్లు కోసం కవిత చేసిన పోరాటం ఫలించిందని, అందుకు ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని కవితపై కృష్ణయ్య ప్రశంసలు కురిపించారు.