Madhapur Drugs Case : మాదాపూర్‌ డ్రగ్స్‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు నవదీప్‌ విచారణ ముగిసింది. శనివారం నవదీప్ హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని టీఎస్‌ నార్కోటిక్‌ విభాగం ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు 6 గంటల పాటు నవదీప్‌పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. వివిధ కోణాల్లో ప్రశ్నించారు. మాదాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీ కేసులో భాగంగా పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. డ్రగ్స్ సప్లయర్ రామచందర్‌తో నవదీప్‌కు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా, డ్రగ్స్ దందాలో ఎవరెవరు ఉన్నారనే విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో నవదీప్‌ను వినియోగదారుడిగా చేర్చిన నార్కోటిక్‌ పోలీసులు.. ఇటీవల 41ఏ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 


విచారణ ముగిసిన అనంతరం నవదీప్‌ మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్‌ బ్యూరో అధికారులు.. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి కొంత సమాచారం తెలుసుకునేందుకు రావాలని నోటీసు ఇస్తే వచ్చానని చెప్పారు. టీఎస్‌ నార్కోటిక్‌ అధికారులకు దేశంలో మంచి రికార్డు ఉందన్నారు. అధికారులు అద్భుతమైన టీమ్‌ను ఏర్పాటు చేశారని ఏడేళ్ల క్రితం కాల్‌ లిస్ట్‌ ఆధారంగా విచారించినట్లు చెప్పారు. బీపీఎం క్లబ్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీసినట్లు తెలిపారు. 


తనకు విశాఖకు చెందిన రామచంద్‌తో పరిచయం ఉందని, కానీ, అతని నుంచి తాను ఎలాంటి డ్రగ్స్‌ కొనుగోలు చేయలేదన్నారు. తాను ఎప్పుడు.. ఎక్కడా డ్రగ్స్‌ తీసుకోలేదన్నారు. గతంలో సిట్‌, ఈడీ విచారించిందని, ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్‌ విభాగం పోలీసులు విచారించినట్లు చెప్పారు. అవసరం ఉంటే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారని, ఎప్పుడు పిలిచినా తాను వస్తానని చెప్పినట్లు నవదీప్‌ వెల్లడించారు.


ఇదీ కేసు..
మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. నవదీప్‌ను 37వ నిందితుడిగా చేర్చారు. మత్తు పదార్థాలు విక్రయించే విశాఖపట్నానికి చెందిన రామ్‌చందర్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే రామ్‌చందర్‌తో నవదీప్‌కు పరిచయం ఉన్నట్లు గుర్తించి నవదీప్‌ను విచారణకు పిలిచారు. రామ్‌చందర్‌, నవదీప్ మధ్య వాట్సాప్ సంభాషణలు, తదితర విషయాలపై పూర్తి ఆధారాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే నవదీప్‌ను విచారణకు రావాలని.. 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగానే నవదీప్‌ శనివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.  


ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు నవదీప్
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం నవదీప్‌ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ఈ నెల 19 వరకు నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. ఆపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. నవదీప్‌ బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ నార్కోటిక్‌ పోలీసులు హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం మరోసారి విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. నవదీప్‌కు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులను ఆదేశించింది. విచారణకు సహకరించాలని హీరో నవదీప్‌కు సూచించింది. ఈ నేపథ్యంలోనే నవదీప్‌ నార్కోటిక్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.