Assembly elections in Telangana:


తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్ స్పష్టం చేశారు. వచ్చే నెల 3, 4, 5 తేదీలలో తెలంగాణ జిల్లాల్లో ఈసీ టీమ్ పర్యటిస్తుందని చెప్పారు. జనవరి నుంచి ఇప్పటివరకూ కొత్తగా 15 లక్షల మందిని ఓటర్ల జాబితాలో చేర్చామని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రంలో 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. ఎన్నికలకు తాము ఏర్పాటు చేస్తున్నామని, అయితే ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ఖరారు చేస్తుందన్నారు.


రాష్ట్రంలో కొత్త ఓటర్లలో 18, 19 వయసు ఉన్న యువ ఓటర్లు 6.99 లక్షల మందిని ఓటర్ల జాబితాలో చేర్చామన్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్ల నమోదుపై ఫోకస్ చేశామన్నారు. థర్డ్ జెండర్ లను, 80 ఏళ్లు పైబడిన వృద్ధులను, పీడబ్ల్యూడీలను గుర్తిస్తున్నామని చెప్పారు. ఈసీ ఆదేశాల మేరకు పీడబ్ల్యూడీలను లక్ష మందికి పైగా ఇటీవల గుర్తించినట్లు తెలిపారు. ఇంటి నుంచి ఓటింగ్ వేసే వారిని గుర్తించి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈసీ అధికారులు, పరిశీలకులు త్వరలో జిల్లాల్లో పర్యటిస్తారు. రాజకీయ పార్టీలతో, కలెక్టర్లు, ఎస్పీలతో, సీఎస్ తో ఎన్నికల అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. 


తెలంగాణలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే నిర్ణీత సమయానికి ఎన్నికల షెడ్యూల్ రాకపోతే, వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని పలు పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రణాళికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులకు ఇదివరకే మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు అక్టోబర్ 3 తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈసీ టీమ్ రాష్ట్రానికి రానుంది. త్వరలోనే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఆయా రాష్ట్రాల్లో ఏర్పాట్లను సమీక్షించనున్నారు. ఇందులో భాగంగానే సీఈసీ తెలంగాణలో తాత్కాలిక పర్యటన తేదీలను రాష్ట్ర అధికారులకు పంపింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితా నుంచి పోలింగ్ కేంద్రాలు, పోలీసు బందోబస్తు, బోగస్‌ ఓటర్ల ఏరివేతపై పనిచేస్తున్నారు. జనవరి నుంచి కొత్తగా 15 లక్షల ఓటర్లు నమోదు కాగా, 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ శనివారం తెలిపారు. 


రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ సిరీస్ తో 13 నుంచి 14 అంకెలతో ఉన్న ఓటరు గుర్తింపు కార్డులను అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఓటరు కార్డు  సంఖ్య 10 అంకెలకు తగ్గించడం తెలిసిందే. రాష్ట్రంలోని 47 లక్షల 22 వేల మంది ఓటర్ల కార్డు నంబర్లు మారగా, నూతన ఫొటో ఓటరు కార్డులు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని కొత్త కార్డులను పొందవచ్చు అని తెలిపారు.