Medchal News: మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే తాను పోటీ చేయబోతున్నట్లు మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. కొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి రెండు నియోజక వర్గాల నుంచి తాను పోటీ చేస్తానని చెప్పిన మాటల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తాను మల్కాజిగిరి నియోజక వర్గం నుంచి మాత్రమే పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.


ఈక్రమంలోనే కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజక వర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు దూల పల్లిలోని ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. శుభాకాంక్షలు చెబుతూ తెగ సందడి చేశారు. ఆయనతో ఆత్మీయంగా మాట్లాడుతూ.. సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కుత్బుల్లాపూర్ టి పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి.. మైనంపల్లి హనుమంతరావును మర్యాద పూర్వకంగా కలిశారు. వారి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగానే మైనంపల్లి హనుమంత రావు మాట్లాడుతూ.. తనకు పదవులు ముఖ్యం కాదని కార్యకర్తలే ముఖ్యమని అన్నారు. అవసరం అయితే కార్యకర్తల కోసం ప్రాణ త్యాగానికి అయినా వెనుకాడబోనని చెప్పారు. తన కోసం బయటకు వచ్చిన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డాCongressరు. 


బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మైనంపల్లి


కొంతకాలంగా బీఆర్ఎస్‌ లో రెబల్‌గా మారిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉంటారా? పార్టీని వీడతారా? అని కొంత కాలంగా ఊగిసలాటలు నడిచిన సంగతి తెలిసిందే. కనీసం ఆయన అనుచరుల్లో కూడా క్లారిటీ లేకుండా ఉంది. తాజాగా బీఆర్ఎస్‌కు రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


బీఆర్ఎస్ పార్టీలో రెండు టికెట్లు ఆశించిన మైనంపల్లి


బీఆర్ఎస్ పార్టీలో తనకు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని మైనంపల్లి హనుమంత రావు కోరిన సంగతి తెలిసిందే. తన సిట్టింగ్ స్థానం మల్కాజ్ గిరి సహా, తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కోసం మెదక్ స్థానం ఇవ్వాలని కోరారు. అందుకు అధిష్ఠానం ఒప్పుకోలేదు. కొద్ది వారాల క్రితం విడుదల చేసిన తొలి విడత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో కేవలం మైనంపల్లి హనుమంతరావుకు మాత్రమే టికెట్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. నిజానికి అంతకుముందే మైనంపల్లి రెబల్ గా మారినప్పటికీ, అభ్యర్థుల ప్రకటనలో ఆయన పేరును తొలగించలేదు.


తర్వాత తనకు పార్టీ కన్నా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని మైనంపల్లి చాలా సందర్భాల్లో చెప్పారు. తాను కేసీఆర్, కేటీఆర్ చివరికి ఆ దేవుణ్ని కూడా లెక్క చేయబోనని అన్నట్లుగా ఆడియో టేప్‌లు కూడా వైరల్ అయ్యాయి. తనకు రెండు టికెట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ ను మాత్రం ఆయన వదల్లేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో ఎదురుతిరిగి.. అసలు ఆయన పార్టీలో ఉంటారా? లేక కాంగ్రెస్ లో చేరతారా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు, మైనంపల్లి పైన బీఆర్ఎస్ అధిష్ఠానం కూడా ఎలాంటి క్రమ శిక్షణ చర్యలు తీసుకోలేదు.


Read Also: Joinings in Telangana Congress: కాంగ్రెస్‌లో చేరుతున్న కీలక నేతలు-ఢిల్లీ వేదికగా జాయినింగ్స్‌