తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్నాయి. ఎలాగైనా బీఆర్‌ఎస్‌ను గద్దె దింపి అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. ఆ దిశగా వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారంటీల పేరుతో హామీల వర్షం కురిపించి ప్రజలు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అభ్యర్థుల జాబితాపై తీవ్ర కసరత్తు చూస్తోంది. ఇంకో వైపు... బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీకి చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. ఢిల్లీ వెళ్లిన ఆయన... ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వేముల వీరేశంతోపాటు బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య పలువురు ముఖ్యనేతలు కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. 2014 ఎన్నికల్లో నకిరేకల్‌లో బీఆర్ఎస్ నుంచి వీరేశం ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో ఓడిపోయారు. ఆయన మీద గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్లో చేరడంతో వీరేశాన్ని పార్టీ పక్కన పెట్టింది. గత ఐదేళ్లుగా ఆయన స్వతంత్రంగానే పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ టికెట్ దక్కకపోవడంతో... కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారు వేముల వీరేశం.
బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కుమారుడు రోహిత్‌తోపాటుతో ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఆయన.. కాంగ్రెస్‌లో చేరికపై ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరపనున్నారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో మైనంపల్లి కూడా ఢిల్లీ వెళ్లి... వారితో చర్చలు జరపనున్నారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరికపై అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. కూత్బుల్లాపూర్ నుంచి మైనంపల్లికి, మెదక్ నుంచి ఆయన కుమారుడు రోహిత్‌రెడ్డికి టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులోగా మైనంపల్లి, ఆయన కుమారుడు కాంగ్రెస్ కప్పుకుంటారని చెప్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతూనే ఉంటాయని అంటున్నారు ఆ పార్టీ నేతలు. భువనగిరికి చెందిన బీఆర్ఎస్ నేత కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. వారు కాకుండా బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి మరో 10 నుంచి 12 మంది నేతలు మరో వారం రోజుల్లో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.