Modi Tour :  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ముందుకు జరిగింది. అక్టోబర్ 2వ తేదీ అనుకున్నా.. ఇప్పుడు ఆ టూర్ ముందుకు జరిగింది. సెప్టెంబర్ 30వ తేదీనే తెలంగాణకు వస్తున్న మోదీ.. మహబూబ్ నగర్ లో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 30న మహబూబ్ నగర్ టౌన్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు. 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 


ప్రధాని సభను 2023 ఎన్నికల శంఖారావం సభగా బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. బహిరంగ సభను చాలా ప్రతిష్టత్మకంగా తీసుకున్న బీజేపీ నాయకులు.. కనీసం లక్ష మందిని సభకు తరలించేలా జన సమీకరణపై దృష్టి పెట్టారు. సభా ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర నేతలు జితేందర్ రెడ్డి, ఆచారి పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ర్టంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీని గ్రామాల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును, కాంగ్రెస్ గ్యారెంటీలపై విమర్శలు చేస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. 
 
మోదీ పర్యటన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు రాష్ట్రానికి రానున్నారు. వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. రాష్ట్ర నేతలతో సమావేశమై  ఎన్నికల కార్యాచరణను ఖరారు చేస్తారని పార్టీ నేతలు తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 3 మార్గాల్లో బస్సు యాత్ర చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం మొదటి ప్రణాళిక వేసుకుంది. ప్రస్తుతానికి బస్సు యాత్రలను వాయిదా వేసింది. బస్సు యాత్రల స్థానంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు, నాలుగు సభలను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభలను రాజకీయ సభలుగానే పరిగణించి.. వాటిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.


అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభల తేదీలను.. ఒకటీ రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సభలను ప్రారంభించి.. ముఖ్యనేతలు, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నాయకులు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది.. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఒకటీ రెండు రోజుల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల జాబితాను కూడా వీలైనంత త్వరగా అక్టోబర్ మొదటి వారంలో వెల్లడించడానికి సిద్ధమవుతున్నారు రాష్ట్ర నేతలు. నియోజకవర్గానికి ముగ్గురు లేదా నలుగురి పేర్లను గుర్తించి.. సర్వేలు, పార్టీ నేతల అభిప్రాయాలు, వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ ముఖ్యనేతలంతా.. అసెంబ్లీ బరిలో నిలవాల్సి ఉంటుందని ఇప్పటికే జాతీయ నాయకత్వం సంకేతాలు ఇచ్చింది. కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా ఇతర కీలక నేతలు అందరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయం అయిపోయినట్లు తెలుస్తోంది.