Nara Lokesh :   అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సీఎం జగన్ పదహారు నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ పొందారు. పదేళ్లల కిందట సెప్టెంబర్ 23నే బెయిల్ లభించింది. దీనిపై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. నారా లోకేష్ సోషల్ మీడియాలో జగన్ పై విమర్శలు గుప్పించారు. బెయిల్ డే ప‌దో వార్షికోత్స‌వ‌ శుభాకాంక్ష‌లు జైలు మోహ‌న్. 42 వేల కోట్లు ప్ర‌జాధ‌నం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా ప‌దేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్ర‌వాది జైలు మోహ‌న్‌ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాల‌రాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడు . జైలులో ఉండాల్సిన జ‌గ‌న్ ప‌దేళ్లుగా బెయిలుపై ఉంటే,  జ‌నంలో ఉండాల్సిన నిజాయితీప‌రుడు సీబీఎన్  జైలులో ఉన్నారని అన్నారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది.  







ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జగన్ అక్రమాస్తుల కేసును సిబిఐ చేపట్టింది. వైెస్ రాజశేఖర్ రెడ్డి రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారని సీబీఐ కేసులు నమోదు చేసిది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రముఖ వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్‌లో రిపోర్టులో 58 కంపెనీలు, 13 మంది వ్యక్తుల పేర్లను నమోదు చేసి 2012 మే 27న సీబీఐ.. జగన్‌ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 16 నెలల పాటు జ‌గ‌న్ చంచ‌ల్ గూడ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబర్ 23లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అప్పట్నుంచి కేసు సాగుతూనే ఉంది.


జగన్ అక్రమాస్తుల కేసులను సత్వరం విచారించాలంటూ తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ హరిరామజోగయ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ గతంలో ప్రతి శుక్రవారం జరిగేది. సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందు వరకూ ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరయ్యేవారు.  అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ కారణాలు, అధికారిక బాధ్యతల కారణంగా విచారణకు హాజరు కావడం లేదు. మధ్యలో కోవిడ్ కారణంగా కోర్టు విచారణ నిలిచిపోయింది. ఆ తర్వాత శుక్రవారం కూడా విచారణ జరగడం లేదు. ప్రజాప్రతినిధులపై ఉన్న తీవ్రమైన నేరాల అభియోగాలను కూడా ఏడాదిలోపు విచారణ పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు నిర్దేశించింది. గతంలో రోజువారీ విచారణ ప్రారంభమయింది. కానీ తర్వాత ఆగిపోయింది. 


సీఎం జగన్ తో పాటు ఇతరులు రకరకాల పిటిషన్లు వేసి.. కేసు విచారణను ఆలస్యం చేస్తున్నారని సీబీఐ అధికారులు కూడా కోర్టుకు పలుమార్లు చెప్పారు. అయినప్పటికీ.. ఇంకా ఈ కేసుల్లో అసలైన ట్రయల్ ప్రారంభం కాలేదు. ఇప్పటికీ కొన్ని పిటిషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఉన్నాయి.