అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నాక సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటం సాధారణమే. ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్‌లో సినిమాలు, సిరీస్‌లు చూసేటప్పుడు యాడ్స్ వచ్చేవి కావు. కానీ త్వరలో ప్రైమ్ వీడియోలో ప్లే అయ్యే కంటెంట్‌లో యాడ్స్‌ను కూడా చూడాల్సి వస్తుంది. 2024 ప్రారంభం నుంచి అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, కెనడాల్లో ప్లే అయ్యే కంటెంట్‌లో యాడ్లు రానున్నాయి.


దీంతో పాటు అమెజాన్ యాడ్ ఫ్రీ ఆప్షన్ కూడా తీసుకువచ్చింది. యాడ్ ఫ్రీ కంటెంట్ చూడాలంటే నెలకు 2.99 డాలర్లు (సుమారు రూ.210) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. పైన పేర్కొన్న నాలుగు దేశాల్లో మొదట యాడ్లు ప్లే అవుతాయి. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, మెక్సికోల్లో తర్వాత ప్రారంభించనున్నారు. మరి భారతదేశం సంగతి తెలియరాలేదు.


ఒక గంట సేపు కంటెంట్‌కు నాలుగు నిమిషాల పాటు యాడ్స్ ప్లే అవుతాయని అమెజాన్ అంటోంది. స్ట్రీమింగ్ సర్వీసులు ఇలాంటి ప్లాన్‌తో రావడం ఇదే తొలిసారి కాదు. నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ కూడా ఇటువంటి ప్లాన్లతోనే ప్రేక్షకుల ముందుకు గతంలోనే వచ్చాయి.


ప్రస్తుతం మనదేశంలో అమెజాన్ ప్రైమ్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ రూ.1,499గా ఉంది. ఒక నెల ప్లాన్ ఖరీదు రూ.299గానూ, మూడు నెలల ప్లాన్ ఖరీదు రూ.599గానూ నిర్ణయించారు. భారతదేశంలో కూడా యాడ్స్ ప్లే చేయాలని ఫిక్స్ అయితే దాని కోసం కొత్త ప్లాన్లు తీసుకొచ్చే అవకాశం ఉంది.


ప్రస్తుతం మనదేశంలో అమెజాన్‌కు ప్రధాన పోటీ నెట్‌ఫ్లిక్స్. నెట్‌ఫ్లిక్స్ భారతీయ మార్కెట్లో అందిస్తున్న చవకైన ప్లాన్ నెలకు రూ. 149గా ఉంది. అయితే ఇది కేవలం మొబైల్ సపోర్టెడ్ ప్లాన్ మాత్రమే. ఒక్క డివైస్‌లో కంటెంట్ స్ట్రీమ్ చేయడానికే ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. సంవత్సరం మొత్తానికి చూస్తే దీని ధర రూ. 1,788కు చేరుతుంది. దీని ఇతర ప్లాన్‌లలో రూ. 199 బేసిక్ మంత్లీ ప్లాన్, రూ. 499 స్టాండర్డ్ మంత్లీ ప్లాన్, రూ. 649 ప్రీమియం మంత్లీ ప్లాన్ కూడా ఉన్నాయి.


ఇక డిస్నీ హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్ సంవత్సరానికి రూ. 1,499గా నిర్ణయించారు. యాడ్స్‌తో వచ్చే సూపర్ ప్లాన్ ధర రూ. 899గా ఉంది. దీంతోపాటు జియో సినిమా ఓటీటీ స్పేస్‌లో ఎంట్రీ ఇచ్చింది. రూ.999తో వార్షిక ప్రీమియం ప్లాన్‌ను కూడా జియో లాంచ్ చేసింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ లాంటి పెద్ద ఓటీటీ ప్లేయర్లను సవాల్ చేయడానికి జియో సినిమా తన ఓటీటీ సర్వీసుతో సిద్ధం అయింది.


Read Also: గుండె పగిలిందా? ఇదిగో ‘యూట్యూబ్’ను అడగండి, ఆ పాటలన్నీ వినిపిస్తుంది - ఈ సరికొత్త ఆప్షన్ మీ కోసమే!


Read Also: ట్విటర్ యూజర్లకు షాక్ ఇవ్వనున్న మస్క్, అందరూ డబ్బు కట్టాల్సిందే ! 


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial