India Canada Tensions:
మైఖేల్ రూబిన్ వ్యాఖ్యలు..
కెనడాలోని ఖలిస్థాన్ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనకాల భారత్ హస్తం ఉందంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau)చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టాయి. అప్పటి నుంచి అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు ట్రూడో. ఇప్పటికే అమెరికా ఈ వివాదంపై స్పందించింది. ఆ ఆరోపణలపై విచారణ జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ (Michael Rubin) చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. జస్టిన్ ట్రూడో సరిదిద్దుకోలేని పెద్ద తప్పు చేశారని వెల్లడించారు. భారత్‌పై మళ్లీ వెనక్కి తీసుకోలేని ఆరోపణలు చేశారని అభిప్రాయపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే గుడ్డిగా ఆరోపించడం సరికాదని తేల్చి చెప్పారు.
"కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సరిదిద్దుకోలేని తప్పు చేశారు. బహుశా ఖలిస్థానీలు కావాలనే ఆయనపై ఒత్తిడి చేసి ఉండొచ్చు. అందుకే భారత్‌పై అలాంటి ఆరోపణలు చేశారు. ఆయన వద్ద ఆధారాలు కూడా లేవు. అయినా కెనడా ప్రభుత్వం ఉగ్రవాదులకు ఎందుకు ఆశ్రయం కల్పిస్తోందో వివరించాల్సిన అవసరముంది"
- మైఖేల్ రూబిన్, పెంటగాన్ మాజీ అధికారి
నిజ్జర్ బిన్ లాడెన్ లాంటి వాడే..
ఖలిస్థాన్ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ని అల్‌కైదా టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్‌తో పోల్చారు మైఖేల్ రూబిన్. ఇదే సమయంలో US సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోని బ్లింకెన్ (Antony Blinken) చేసిన వ్యాఖ్యల్నీ ప్రస్తావించారు. భారత్, కెనడా మధ్య జరుగుతున్న వివాదంపై బ్లింకెన్ విచారం వ్యక్తం చేశారు. కానీ...కెనడా చేసిన ఆరోపణల్నీ పరిగణనలోకి తీసుకోవాలని..ఈ విచారణకు భారత్ సహకరించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పరోక్షంగా భారత్‌ని తప్పుబట్టే కుట్ర జరుగుతోందన్న వాదనలు వినిపించాయి. ఈ వ్యాఖ్యల్ని ప్రస్తావించిన మైఖేల్ రూబిన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ ఉగ్రవాది హత్యకు గురైతే అందులో భారత్ హస్తం ఉందని ఆరోపించడంలో అర్థం లేదని తేల్చి చెప్పారు. దానికి మద్దతునివ్వడాన్నీ తప్పుబట్టారు.
"ఈ విషయంలో మనల్ని మనం మోసం చేసుకోవడం ఎందుకు..? హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ఏమైనా సాధారణ వ్యక్తా..? ఎన్నో దాడులు చేసిన ఉగ్రవాది. బ్లింకెన్ నిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది. అమెరికా ఇలాంటి ఉగ్రచర్యలకు ఎప్పుడూ మద్దతునివ్వదు"
- మైఖేల్ రూబిన్, పెంటగాన్ మాజీ అధికారి
Also Read: ఇది మరో శివశక్తి పాయింట్, ఆ మహాదేవునికే అంకితం - వారణాసి క్రికెట్ స్టేడియంపై ప్రధాని వ్యాఖ్యలు