DK Shivakumar: 


NDAలో చేరిన జేడీఎస్‌ 


హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని కర్ణాటక పార్టీ JDS ఎన్‌డీఏ కూటమిలో (JDS Joins NDA) చేరుతున్నట్టు ప్రకటించింది. చాలా రోజులుగా బీజేపీ,జేడీఎస్ మధ్య ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. సీట్‌ల షేరింగ్‌పై సుదీర్ఘ చర్చలు జరిగిన తరవాత జేడీఎస్‌ బీజేపీ నేతృత్వంలోని NDA కూటమిలో చేరుకునేందుకు అంగీకరించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ తరవాత ఈ ప్రకటన చేశారు. దీనిపై కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివ కుమార్ స్పందించారు. జేడీఎస్‌కి "బెస్ట్ ఆఫ్ లక్" చెప్పారు. బెంగళూరులో కేబినెట్ మీటింగ్ జరిగిన తరవాత ఈ వ్యాఖ్యలు చేశారు శివకుమార్. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది జేడీఎస్. ఆ పార్టీ ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్‌కే మళ్లింది. అయితే...రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ, జేడీఎస్ కలిసి కాంగ్రెస్‌పై పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వచ్చే నెల దసరా తరవాత సీట్‌ల షేరింగ్‌పై అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి బరిలోకి దిగిన JDS ఈ సారి బీజేపీతో కలవడం ఆసక్తికరంగా మారింది. 2019లో లోక్‌సభ ఎన్నికలు జరిగిన సమయానికి కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వమే కర్ణాటకలో అధికారంలో ఉంది. ఆ తరవాత కొన్నాళ్లకు జేడీఎస్‌కి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం వల్ల ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అప్పటికప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో ఈ పరిణామాలు చాలా నాటకీయంగా సాగాయి. 


జేడీఎస్ ఎఫెక్ట్ ఉంటుందా..? 


గతంలో బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి అధికారంలోకి వచ్చింది జేడీఎస్. 2006 జనవరి నుంచి దాదాపు 20 నెలల పాటు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపింది. ఆ తరవాత 2018  మే నెల నుంచి 14 నెలల పాటు కాంగ్రెస్‌తో కలిసి అధికారంలో ఉంది. ఈ రెండు సార్లు కుమారస్వామి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఎప్పుడూ ఎన్నికల్లో కింగ్ మేకర్ స్థానంలో ఉంటూ వస్తున్న JDS ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బాగా వెనకబడిపోయింది. ఓటర్లు కాంగ్రెస్‌కి భారీ మెజార్టీ ఇచ్చారు. ఫలితంగా...ప్రభుత్వ ఏర్పాటులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. 


హోంమంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ అయిన తరవాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. జేడీఎస్ పార్టీ NDA కూటమిలో చేరుతున్నట్టు ధ్రువీకరించారు.


"కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,జేడీఎస్‌ చీఫ్ హెచ్‌డీ కుమారస్వామిని హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కలిశాను. జేడీఎస్‌ పార్టీ ఎన్‌డీఏ కూటమిలో చేరుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. జేడీఎస్ పార్టీకి NDAలోకి ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం. ఈ చేరికతో కూటమికి మరింత బలం వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ విజనరీకి అనుగుణంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం"


- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు 


Also Read: అది మోదీ మల్టీప్లెక్స్, మరీ ఇరుగ్గా గజిబిజిగా ఉంది - కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌పై కాంగ్రెస్ సెటైర్లు