One Nation, One Election:
తొలి భేటీ..
ఒకే దేశం, ఒకే ఎన్నికపై కేంద్రం కసరత్తు వేగవంతం చేసింది. నిజానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కచ్చితంగా దీనిపై చర్చ జరుగుతుందని అంతా భావించారు. కానీ కేవలం మహిళా రిజర్వేషన్ బిల్‌ని తీసుకొచ్చేందుకే కేంద్రం ఈ స్పెషల్ సెషన్ పెట్టిందని క్లారిటీ వచ్చేసింది. కానీ జమిలి ఎన్నికలపై మాత్రం ఎక్కడా ప్రస్తావన రాలేదు. ఈ క్రమంలోనే కేంద్రం వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. అసలు ఒకేసారి ఎన్నికలు నిర్వహిచండ సాధ్యమేనా..అన్న అంశంపై తొలిసారి కోవింద్ కమిటీ నేడు (సెప్టెంబర్ 23) భేటీ అవుతుండడం మరింత ఉత్కంఠ రేపుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ చర్చించనుంది. ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే కేంద్రం తదుపరి కార్యాచరణ ఉండనుంది. ఇప్పటికే కేంద్ర న్యాయ శాఖ ఈ కమిటీలోని 8 మంది సభ్యుల పేర్లను వెల్లడించింది. వీరందరికీ రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వం వహించనున్నారు. అసెంబ్లీ, పంచాయతీలు, మున్సిపాలిటీలు, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యమవుతుందా లేదా ఈ కమిటీ నిర్ణయించనుంది. అంతే కాదు. ఇందుకోసం రాజ్యాంగంలో ఏమైనా సవరణలు చేయాల్సి ఉంటుందా అన్నదీ చర్చించనున్నారు సభ్యులు. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ జనరల్ సెక్రటరీ సుభాష్ కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి, న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు.
ముందస్తు ఎన్నికలు..?
కేంద్రం ఒకే దేశం, ఒకే ఎన్నికపై కసరత్తు చేస్తున్న క్రమంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ సంకేతాలిచ్చారు. కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయం చెప్పారు. దీనిపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన ఏమీ లేదని తేల్చి చెప్పారు. అంతే కాదు. ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగే అవకాశాలు కూడా లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వ గడువు ముగిసిపోయేంత వరకూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సేవ చేస్తారని వెల్లడించారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ముందస్తు ఎన్నికలు అంటూ మీడియాలో ప్రచారం జరుగుతుండటాన్ని కొట్టి పారేశారు.
Also Read: చిన్న పిల్లాడిపైనా మీ ప్రతాపం, ఇదేం కొత్త కాదుగా - సనాతన ధర్మం వివాదంపై కమల్ కామెంట్స్