Sanatan Dharma Row:
ఇది కొత్తేమీ కాదు..
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ చీఫ్ కమల్ హాసన్ సనాతన ధర్మ వివాదంపై స్పందించారు. అనవసరంగా ఉదయనిధి స్టాలిన్‌ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని అన్నారు. కోయంబత్తూర్‌లో పార్టీ మీటింగ్‌కి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ పేరు ఎత్తకుండానే ఓ చిన్న పిల్లాడిపై బీజేపీ దాడి చేస్తోందని విమర్శించారు. కేవలం సనాతన ధర్మం అనే పదం వాడినందుకే ఇంత రభస చేస్తున్నారని మండి పడ్డారు. ఈ వివాదం కొత్తేమీ కాదని, ద్రవిడ ఉద్యమం సిద్ధాంతమే ఇది అని తేల్చి చెప్పారు. ద్రవిడ ఉద్యమం నుంచి వచ్చిన నేతలందరికీ సనాతన ధర్మంపై ఇలాంటి అభిప్రాయమే ఉంటుందని వివరించారు. ఉదయనిధి తాతయ్య డీఎమ్‌కే అధినేత ఎమ్ కరుణానిధి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని వెల్లడించారు. పెరియార్ వి రామస్వామి ఆయన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలతోనే అసహనానికి గురై ఉద్యమించారని చెప్పారు. సనాతన ధర్మం అంటే ఏంటో అందరికీ అర్థమైంది కేవలం పెరియార్ వల్లే అని స్పష్టం చేశారు. పెరియార్ ఓ ఆలయంలో పని చేశారని, కాశీలో పూజలు కూడా చేశారని చెప్పిన కమల్ హాసన్...అక్కడి పరిస్థితులను చూసిన తరవాతే తన జీవితం మొత్తాన్ని ద్రవిడ ఉద్యమానికి అంకితం చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా పెరియార్‌ని తమ వాడే అని చెప్పుకోడానికి లేదని, ఆయన ప్రజల మనిషే అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికల గురించీ మాట్లాడారు. బీజేపీ తమ అనకూలత కొద్దీ ఎన్నికలను ముందే నిర్వహించే అవకాశాలున్నాయని అన్నారు.
"కేవలం 'సనాతనం' అనే పదం వాడినందుకు ఇవాళ ఓ యువకుడు ( ఉదయనిధి స్టాలిన్ ) మీద దాడి చేస్తున్నారు. అంతకముందు తరాలవారే 'సనాతనం' పదాన్ని ఉపయోగించారు. పెరియార్ వల్లే మనందరికీ 'సనాతనం' గురించి తెలిసింది. ఆయన ఒకప్పుడు గుడిలో పనిచేసేవారు. నుదుట తిలకం ధరించి వారణాసిలో పూజలు కూడా చేశారు. ఆయనకు ఎంత కోపం ఉండి ఉండకపోతే, అవన్నీ పక్కకు పెట్టి మరీ మానవసేవే మాధవసేవ అని రియలైజ్ అయి ఉంటారు..?! ఇక అక్కడ్నుంచి జీవితమంతా అలానే గడిపారు. డీఎంకే కానీ వేరే ఏ రాజకీయ పార్టీ కానీ పెరియార్ ను తమవారిగా చెప్పుకోలేరు. పెరియార్ తమిళనాడు మొత్తానికి చెందిన వ్యక్తి."
- కమల్ హాసన్, సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మొత్తం 14 మందికి నోటీసులిచ్చింది. వీరిలో డీఎమ్‌కే ఎంపీ ఏ. రాజా కూడా ఉన్నారు. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్‌పై FIR నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ని విచారించిన సుప్రీంకోర్టు ఆ మేరకు నోటీసులు అందించింది. తమిళనాడు పోలీసులు, CBI,తమిళనాడు ప్రభుత్వానికి కూడా నోటీసులు అందాయి. వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. అయితే...ఈ వ్యాఖ్యల్ని విద్వేషపూరిత ప్రసంగంగా పరిగణించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. ఈ నోటీసులపై DMK నేత టీకేఎస్ ఎలంగోవన్ స్పందించారు. కొంత మంది ఈ వ్యాఖ్యల్లో క్లారిఫికేషన్ కావాలని పిటిషన్ వేశారని, తాము కూడా సనాతన ధర్మం అంటే ఏంటో వివరణ అడుగుతామని అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు తాము స్పందిస్తామని వెల్లడించారు.
Also Read: చేతనైతే ముందు మీ దేశాన్ని చక్కబెట్టుకోండి, పాక్‌కి వార్నింగ్ ఇచ్చిన భారత్