Singham: న్యాయ ప్రక్రియ గురించి పట్టించుకోకుండా సత్వర న్యాయం అందించే సింగం వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు సమాజానికి హానికరమైన సందేశాన్ని పంపుతాయని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ అన్నారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీసు సంస్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల అసహనాన్ని సైతం ఆయన ప్రశ్నించారు. పోలీసు సంస్కరణల గురించి మాట్లాడుతూ.. ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. మనల్ని మనం సంస్కరించుకుంటే తప్ప చట్టాన్ని అమలు చేసే యంత్రాంగాన్ని సంస్కరించలేమన్నారు.


పోలీసులను రౌడీలుగా, అవినీతిపరులుగా, బాధ్యతారాహిత్యంగా చూపించే చిత్రాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులతో సహా ఇతరుల గురించి కూడా  అలాగే చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు తమ పని చేయడం లేదని ప్రజలు భావించినప్పుడు, పోలీసులు చేసే పనులను ప్రజలు స్వాగతిస్తూ సంబరాలు చేసుకుంటారని న్యాయమూర్తి అన్నారు. రేప్ కేసుల్లో నిందితులు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్‌కౌంటర్‌లో చంపినప్పుడు, ప్రజలు దానిని స్వాగతిస్తున్నారని,  కానీ నిజంగా న్యాయం జరిగిందా, వారికి అలా అనిపిస్తుందా అంటూ ఆయన ప్రశ్నించారు.


భారత్‌లో సినిమాల ప్రభావం చాలా ఎక్కవ అని, అవి చాలా బలంగా ఇతర అంశాలను ప్రతిబింస్తాయని జస్టిస్ పటేల్ పేర్కొన్నారు. సినిమాల్లో న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను తక్కువ చేసి చూసిప్తారని, పిరికివాళ్లుగా మందపాటి కళ్లద్దాలు ధరించి దోషులను విడిచిపెడతారనేలా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పోలీసులను హీరోలుగా చూపిస్తూ ఒంటరిగా న్యాయం చేస్తాడని అనిపించేలా చిత్రీకరిస్తున్నారని అన్నారు. సింగం సినిమా ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో ప్రకాష్ రాజ్ పోషించిన రాజకీయ నాయకుడిపై మొత్తం పోలీసు బలగాలు తిరగబడతాయని, దానితో న్యాయం జరిగినట్లు చూపించారని అన్నారు.


అందులో ఎక్కడైనా న్యాయం జరిగిందా? అని జస్టిస్ పటేల్ ప్రశ్నించారు. ఆ సందేశం ఎంత ప్రమాదకరమైందో ఆలోచించాలని, ప్రజల్లో ఎందుకు ఈ అసహనం? అంటూ జస్టిస్ పటేల్ అడిగారు. అపరాధాన్ని, నేరాన్ని తేల్చే ప్రక్రియలు నెమ్మదిగా ఉంటాయని, ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను జప్తు చేయకూడదనే న్యాయస్థానాల ప్రధాన సూత్రం అన్నారు. సత్వరమార్గాలకు అనుకూలంగా తాము వ్యవహరిస్తే, చట్టబద్ధమైన పాలనను పాడుచేసినట్లువుతుందని అన్నారు. పోలీసు సంస్కరణలను ఒంటరిగా చూడలేమని, ఇతర ముఖ్యమైన సంస్కరణలు అవసరమన్నారు.


పోలీసు యంత్రాంగం పనితీరులో సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన ఉత్తరప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రకాష్ సింగ్, పోలీసు సంస్కరణల కోసం ఆయన అలుపెరగని, అవిశ్రాంతంగా కృషి చేశారని ఆయన కొనియాడారు. 2010లో సూర్య హీరోగా వచ్చిన సింగం సినిమాను 2011లో అజయ్ దేవగణ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేశారు. అక్కడ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.