Visakha Vandanam: విశాఖపట్నంలో సీఎం కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన చర్యలు దశల వారీగా చేపడతామని, విజయదశమి నుంచి పాలనకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే కమిటీ వేసినట్లు వైఎస్సార్‌సీపీ నేత వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలిపారు. విశాఖ వందనం పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం నిర్వహిస్తామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖ రాజధాని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన భేటీకి శనివారం మంత్రి గుడివాడ అమర్నాథ్ తో కలిసి వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. అన్ని సమకూర్చుకున్న తర్వాతే విజయదశమి నుంచి విశాఖ నుంచి సీఎం జగన్ పాలనా ముహూర్తం ఖరారు అయిందని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 


జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ నేతృత్వంలో శనివారం జరిగిన సమావేశంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో సహా పలువురు జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల నుంచి స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారని తెలియజేశారు.


2014లో రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన వారు లక్షల కోట్ల రూపాయలతో అమరావతిలో రాజధాని నిర్మించాలనుకున్నారు. అది సాధ్యం కాకపోవడంతో ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఆలోచన చేశారని చెప్పారు. ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో మూడు రాజధాని అంశాన్ని తెరమీదకి తీసుకురావడం లేదని, ఇప్పుడు ఈ రాజధానులు ఏర్పడకపోతే మళ్లీ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి విశాఖకు వస్తే ఇక్కడ అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయన్న ఆలోచనను పూర్తిగా తుడిచి వేసే విధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకే ఈ మూడు రాజధానుల ఏర్పాటు అని సుబ్బారెడ్డి నొక్కి వక్కాణించారు. 


జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో  నిర్వహించిన విశాఖ గర్జన ద్వారా మన ఆకాంక్షను దేశవ్యాప్తంగా తెలియజేయగలిగామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖకు రాజధాని తరలించే విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి అయినా పాలన సాగించవచ్చు అన్న భావనతో జగన్మోహన్ రెడ్డి విశాఖ వైపు అడుగులు ముందుకు వేస్తున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. కొద్ది రోజుల కింద జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దసరా నాటికి విశాఖకు తరలి వెళ్లడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.


సీఎంఓ ఆఫీస్, మంత్రుల కార్యాలయాలు, ఉద్యోగులకు వసతి సౌకర్యాలు కల్పించే అంశాలపై ఒక కమిటీని కూడా రూపొందిస్తున్నారని, 10, 15 రోజుల్లో దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభమవుతుందని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. అమరావతి, రాయలసీమ ప్రాంతాలకు తాము వ్యతిరేకం కాదని, వాటితో పాటు ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని ఆయన చెప్పారు. విజయదశమి నాటికి విశాఖ రానున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికే బాధ్యతను జాయింట్ యాక్షన్ కమిటీకి అప్పగిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ విషయంలో జేఏసీ సభ్యులు ఇచ్చిన పలు సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని అమర్నాథ్ చెప్పారు.