APSRTC Special Offer: ఆంధ్రప్రదేశ్ లో 60 ఏళ్ల పైబడిన వారికి ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. బస్సుల్లో ప్రయాణ సమయమంలో 25 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే రాయితీని పొందాలనుకునే వృద్ధులు 60 ఏళ్లు దాటినట్లుగా ఉండే ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాస్ పోర్టు, రేషన్ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. అలాగే ఫోన్ లో ఆధార్ కార్డు చూపించినా రుజువుగా భావిస్తామని చెప్పుకొచ్చారు. పైన చెప్పిన వాటిల్లో ఏ ఒక్క కార్డును వెంట తీసుకొచ్చినా.. టికెట్లలో పాతిక శాతం రాయితీ కల్పిస్తామన్నారు. అయితే అన్ని జిల్లాల డీఎంలు, సూపర్ వైజర్లు.. కండెక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు వివరించారు. ప్రత్యేక సమావేశాల ద్వారా సిబ్బందికి, ఏటీబీ ఏజెంట్లకు ప్రజల్లో ఎలా అవగాహన కల్పించాలో సూచించాలన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయం
విమాన ప్రయాణాల తరహాలోనే ఆర్టీసీ బస్సుల్లోనూ మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశ పెట్టబోతున్నట్లు వెల్లడించింది. ఒక పట్టణం లేదా నగరం నుంచి మరో పట్టణం, నగరానికి నేరుగా బస్సు సౌకర్యం లేనప్పుడు బ్రేక్ జర్నీ విధానంలో ఆన్ లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తిరుపతి నుంచి భద్రాచలం వెళ్లేందుకు నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తిరుపతి నుంచి విజయవాడకు, అక్కడి నుంచి భద్రాచలానికి ఒకేసారి రిజర్వేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నై, బెంగళూరు వంటి దూర ప్రాంతాలకు కూడా బస్ రిజర్వేషన్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. బ్రేక్ జర్నీ సమయం కనీసం రెండు గంటల నుంచి గరిష్టంగా 22 గంటల వరకు ఉండొచ్చు. మొదటి దశలో రాష్ట్రంలో 137 పట్టణాలు, నగరాల నుంచి ఈ మల్టీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశ పెట్టింది. ఆ తర్వాత దశల్లో మరిన్ని పట్టణాలకు ఈ సౌలభ్యాన్ని విస్తరించనుంది.
దసరాకు టీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 15వ తేదీ నుంచి 29వ తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఆయా తేదీల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది.
“బతుక్మమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం సంస్థ అధికారిక వెబ్ సైట్ tsrtconline.in ని సంప్రదించాలి.” - టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్