Elon Musk: ఎక్స్ (ట్విటర్)లో మరోసారి మార్పులు చేపట్టనున్నట్లు ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ సూచనప్రాయంగా తెలిపారు. ట్విటర్‌ను కొనుగోలు చేసిన అనంతరం ఎలన్ మస్క్ పలు మార్పులు తీసుకొచ్చారు. ట్విటర్ పేరును X గా మార్చారు. ఆపై బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ ప్రవేశ పెట్టారు. అంతకు ముందు వెరిఫైడ్ అకౌంట్లు పొందే బ్లూ టిక్‌ను పెయిడ్ సర్వీసుగా మార్చారు. ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వెరిఫైడ్ అకౌంట్లకు జమ చేస్తున్నారు. తాజాగా ఆయన మరో కీలక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్తులో Xని ఉపయోగించే ప్రతి ఒక్కరూ నెలవారీ రుసుము చెల్లించాల్సి ఉంటుందని మస్క్ పేర్కొన్నారు. బాట్స్ (Bots), నకిలీ ఖాతాల సమస్యను ఎదుర్కోవడానికి ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ రుసుము ఎంత ఉంటుందో? రుసుము చెల్లించిన వారికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఆయన మస్క్ వివరించలేదు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో చర్చల సందర్భంగా మస్క్ X వివరాలను వెల్లడించారు. ఇప్పుడు X కు 550 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారని, ప్రతిరోజూ 100 నుంచి 200 మిలియన్ల మధ్య పోస్ట్‌లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వినియోగదారులలో ఎంత మంది నిజమైన వినియోగదారులు ఉన్నారు? బాట్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయో మస్క్ స్పష్టంగా చెప్పలేదు. కృత్రిమ మేధస్సు, అధునాత సాంకేతికతతో వచ్చే ప్రమాదాలు, వాటి నివారణపై నెతన్యాహుతో మస్క్ చర్చించారు.
ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన తర్వాత, మస్క్ X ప్లాట్‌ఫాంలో గణనీయమైన మార్పులు చేశారు. గతంలో నిషేధించిన ఖాతాలను తిరిగి రావడానికి అతను అనుమతించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి అకౌంట్ల పునరుద్ధరించారు. ప్రముఖ వ్యక్తుల ఖాతాలను గుర్తించే బ్లూ టిక్‌ను తొలగించారరు. ప్రస్తుతం ఎవరైనా సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే వారి పేరు పక్కన బ్లూ బ్యాడ్జ్‌ని పొందుతారు. వారి పోస్టులు ఎక్కువ మందికి కనిపిస్తాయి. సబ్‌స్క్రిప్షన్ తీసుకోని వారి పోస్టుల రీచ్ తక్కువగా ఉంటుంది. ఈ మార్పులతో X ప్లాట్‌ఫాంలో బాట్‌ల వినియోగాన్ని తగ్గిస్తుందని మస్క్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే X యునైటెడ్ స్టేట్స్‌లో మనీ ట్రాన్స్‌మిటర్‌గా మారడానికి లైసెన్స్‌లను పొందేందుకు దరఖాస్తు చేసుకుంది. పబ్లిక్ రికార్డుల ప్రకారం ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో అనుమతులు వచ్చాయి.
ఇటీవల కాలంలో Xలో విద్వేషపూరిత ప్రసంగం, యూదు వ్యతిరేక కంటెంట్‌ను ఆపడానికి చర్యలు తీసుకోకపోవడంతో పౌర హక్కుల సంఘాల నుంచి మస్క్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ క్రమంలో యూదు సంస్థ యాంటీ-డిఫమేషన్ లీగ్ (ADL)పై దావా వేయాలనుకున్నారు. అయితే X ఆదాయంపై ప్రభావం చూపుతుందనే ఆలోచనతో దానిని విరమించుకున్నాడు.