Pawan Kalyan: మహిళా రిజర్వేషన్ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. చట్టసభల్లో మహిళా మణుల ప్రాతినిధ్యం పెంచాలని చూడడం నిజంగా సంతోషంగా ఉందన్నారు. వనితా లోకం ఆకాంక్షలు నెరవేరే రోజులు సమీపంలోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇందుకు అవసరమైన మహిళా రిజర్వేషన్ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అంటూ వ్యాఖ్యానించారు. చారిత్రాత్మకమైన ఈ బిల్లు కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందేలా కృషి చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి హృదయ పూర్వక అభినందనలు తెలియచేస్తున్నానన్నారు. చట్ట సభల్లో 33 శాతం స్థానాలు మహిళలకు దక్కేలా చేసే ఈ బిల్లు విషయమై వాగ్దానాలు, నినాదాలకు పరిమితం కాకుండా కార్యరూపం దాల్చేలా చేయడంలో ప్రధాని మోదీ ఎంతో చిత్తశుద్ధి చూపారని వివరించారు. ఈ బిల్లు చట్ట సభల్లోనూ ఆమోదం పొందితే కచ్చితంగా రాజకీయంగా మహిళా సాధికారత సాధ్యం అవుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధితోపాటు మహిళా రక్షణ, విద్య, వైద్యం లాంటి అంశాల్లో మహిళా ప్రతినిధులు విలువైన చర్చలు చేయగలరని వ్యాఖ్యానించారు. అలాగే ఈ బిల్లును చట్ట సభల సభ్యులు ఏకాభిప్రాయంతో ఆమోదిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. 






.










పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తొలి రోజే మహిళా రిజర్వేషన్‌ బిల్లు అంశం ప్రస్తావనకు వచ్చింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభ ఆమోదించాలని కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌  రంజన్‌ చౌదరి కోరారు. దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది ఈ బిల్లు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకావానికి ముందు రోజు జరిగిన అఖిల పక్ష సమావేశంలో అధికార, ప్రతిపక్ష కూటమికి చెందిన పార్టీల నుంచి ఈ బిల్లుకు మద్దతు లభించింది. మహిళా రిజర్వేషన్ బిల్లును... ఐదు రోజుల ప్రత్యేక సెషన్‌లో ప్రభుత్వ  అజెండా జాబితాలో చేర్చనప్పటికీ... తగిన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని  కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడింది. అది ఇప్పటికీ లాప్‌ కాలేదు. దీంతో లోక్‌సభలో బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించడమే మిగిలింది.