Irregularities in sheep distribution scheme : నాంపల్లిలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశుసంవర్ధక శాఖ కేసులను తెలంగాణ ప్రభుత్వం ఏసీబీకి బదిలీ చేసింది. ఫైల్స్ మాయం, నిధుల స్వాహా కేసులను ఏసీబీకి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గొర్రెల పంపిణీ నిధుల బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలింది.. ఇప్పటికే పలువురిపై అక్రమాలపై కేసులు నమోదయ్యాయి.. న‌కిలీ బ్యాంక్ ఖాతాలు తెరిచి మొత్తం రూ.2 కోట్ల‌కు పైగా నిధులు దారిమళ్లించార‌నే అభియోగాలు అధికారుల‌పై న‌మోద‌య్యాయి.. అయితే ఇదే కేసులో ఇటీవల గచ్చిబౌలి పోలీసులు నలుగురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.. తాజాగా ఈ కేసును ఏసీబీకి బదిలీ చేశారు.


రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు కాగానే  పలుచోట్ల ఫైళ్లు మాయం దగ్ధం కావడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.   మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ మాసబ్ ట్యాంక్ లోని పశు సంవర్ధక శాఖ ఆఫీసులోకి అక్రమంగా ప్రవేశించి, సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న  ఫైళ్లను చింపివేసి, కొన్ని ముఖ్యమైన ఫైల్స్​ను తన కారులో తీసుకెళ్లాడు. ఈమేరకు వాచ్​మెన్ మందాల లక్ష్మయ్య ఫిర్యాదుతో పోలీసులు కల్యాణ్, ఆపరేటర్‌ మోహన్‌ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్‌లపై కేసు నమోదు చేశారు.  


బినామీ పేర్లతో ఖాతాలు తెరిచి రూ.2.08 కోట్ల నిధుల దారి మళ్లింపు, పశుసంవర్థక భవన్‌లో ఫైళ్లు మాయమైన ఉదంతాలపై పోలీసులు కొంత విచారణ జరిపారు.  నిధుల మళ్లింపు వ్యవహారంలో నలుగురు అధికారులు, ఇద్దరు గొర్రెల దళారులపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.   ఇప్పటికే పోలీసులు కొంతమేర దర్యాప్తు చేపట్టినా మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావిస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  


పశుసంవర్థక శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు కుమ్మక్కై నిధులను దారి మళ్లించారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పనిచేస్తున్న రవికుమార్‌, ఆదిత్య కేశవ్‌సాయి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఇద్దరు అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు కలిసి గతేడాది ఆగస్టు 13 నుంచి 23 మధ్యకాలంలో ఏపీలో పర్యటించారు. 18 మంది రైతుల నుంచి 133 యూనిట్లు (2,793 గొర్రెలు) సేకరించారు. వాస్తవానికి గొర్రెలు విక్రయించిన ఏపీ రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయాల్సి ఉంది. కానీ అలా చేయకుండా దళారులకు చెందిన బినామీ ఖాతాల్లోకి రూ.2.08 కోట్లు మళ్లించారు. డబ్బులు రాకపోవటంతో ఏపీ రైతులు కాంట్రాక్టర్‌ను నిలదీశారు. పశుసంవర్థక శాఖ డైరెక్టరేట్‌లో ఆరా తీయగా డబ్బుల చెల్లింపు పూర్తయినట్లు అధికారులు ఽధ్రువీకరించారు. దీంతో కాంట్రాక్టర్‌ వెళ్లి గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పశుసంవర్థక శాఖ ఏడీలు రవికుమార్‌, ఆదిత్య కేశవ్‌ సాయితోపాటు ఇద్దరు దళారులపై ఐపీసీ సెక్షన్లు- 406, 409, 420 ప్రకారం గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కల్యాణ్‌ కుమార్‌ మసాబ్‌ ట్యాంక్‌లోని రాష్ట్ర పశుసంవర్థకశాఖ కార్యాలయానికి వెళ్లి కీలక ఫైళ్లను చించేసి, కాగితపు ముక్కలను బస్తాలో మూటగట్టుకొని తన కారులో వేసుకొని వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. 


రాష్ట్రంలోని గొల్ల-కురుమలకు రూ.75 వేలు చేతిలో పెట్టి యూనిట్లు కాజేసిన సంఘటనలు, గొర్రెలతో లబ్ధిదారుల ఫొటోలు తీయించి, వాహనాల్లో తీసుకెళ్లి, రైతులతో ఒప్పందం చేసుకొని, మళ్లీ అవే వాహనాల్లో తిరిగి జీవాలను తీసుకెళ్లిన ఉదంతాలు కోకొల్లలుగా జరిగాయి. 20 గొర్రెలు, ఒక పొట్టేలుకు బదులుగా చిన్నవి, నాణ్యత లేని, రోగాల బారిన పడిన జీవాలను కూడా రైతులకు అంటగట్టారు. గొర్రెల రీ-సైక్లింగ్‌ అక్రమ రవాణాపై అప్పట్లో కేసులు కూడా నమోదయ్యాయి. రాష్ట్ర పశుసంవర్థక శాఖకు చెందిన 24 మంది అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఏసీబీ విచారణలో ఇవన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.