Kodi Pulav Recipe : పలావ్ అనేది ఓ ఎమోషన్. అందులోనూ కోడితో చేసే పలావ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని బయట ఆర్డర్ చేసుకోవాల్సిన పని లేదు. చక్కగా ఇంట్లోనే అందరూ కలిసి తయారు చేసుకోగలిగే టేస్టీ రెసిపీ ఇక్కడుంది. ఈ చికెన్ పులావ్​ను ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


మసాలా కోసం కావాల్సిన పదార్థాలు


అల్లం - 2 అంగుళాలు


వెల్లుల్లి - 2 (రెండు వెల్లుల్లి పాయల పూర్తి రెబ్బలు)


లవంగాలు - 8


యాలకులు - 8


ధనియాలు - 2 స్పూన్లు 


దాల్చిన చెక్క - కొంచెం


గసగసాలు - ఒకటిన్నర స్పూన్లు


జాపత్రి - 1


మరాఠి మొగ్గలు - 2


అనాస పువ్వు - 1


వీటన్నింటిని మిక్సీ జార్​లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం నీరు వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. 


మేరినేషన్​ కోసం కావాల్సిన పదార్థాలు 


చికెన్ - అరకిలో 


ఉప్పు - తగినంత


పసుపు - కొంచెం


పెరుగు - రెండు స్పూన్లు


వెన్న - 1 స్పూన్


నిమ్మకాయ - 1 


చికెన్ మేరినేట్ చేసుకోవడానికి


చికెన్​ను మేరినేట్ చేసుకోవడం కోసం పసుపు వేసి బాగా కడగాలి. ఇప్పుడు ఓ గిన్నెలోకి చికెన్ తీసుకోవాలి. దానిలో ముందుగా తయారు చేసిన మసాలను రెండు స్పూన్లు వేయాలి. ఉప్పు, పసుపు, పెరుగు, వెన్న వేసి బాగా కలపాలి. దానిలో నిమ్మరసం పిండి మరోసారి మసాలాలు అన్ని బాగా పట్టేలా చేతితో కలుపుకోవాలి. మీరు ఇది ముందుగానే ప్లాన్ చేసుకుంటే మీరు బిర్యానీ చేయాలనుకుంటున్న ముందు రోజు రాత్రి మారినేట్ చేసుకోవచ్చు. లేదు అంటే కనీసం ఓ గంటైనా చికెన్​ను మారినేట్ చేయాలి. బియ్యాన్ని కూడా గంట ముందే నానబెట్టుకోవాలి.


కావాల్సిన పదార్థాలు


ఉల్లిపాయలు - 5


పచ్చిమిర్చి - 14


పుదీనా - 1 కప్పు


కొత్తిమీర - 1 కప్పు


బియ్యం - అరకేజి 


నెయ్యి - 3 స్పూన్లు


జీడిపప్పు - 10 


యాలకులు - 3


దాల్చిన చెక్క - కొంచెం 


లవంగాలు - 4


బిర్యానీ ఆకులు - 2


అనాస పువ్వు - 1


మరాఠీ మొగ్గలు - 2


తయారీ విధానం


ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పొడవుగా ముక్కలు తరిగి పెట్టుకోండి. రెండు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిలను చికెన్ తయారీ కోసం ఉపయోగించుకోవాలి. మిగిలినవి బిర్యానీకోసం ఉపయోగించుకోవచ్చు. చికెన్ తయారీ కోసం స్టౌవ్ వెలిగించి ఒక కడాయి పెట్టండి. దానిలో కాస్త నెయ్యి, నూనె వేసి నాలుగు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మేరినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా తిప్పాలి. అనంతరం మూత పెట్టి చికెన్​ను ఉడకనివ్వాలి. చికెన్ మొత్తంగా కాకుండా 80 శాతం ఉడికేలా చూసుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడకుండా చూసుకోండి.


ఇప్పుడు స్టౌవ్ వెలిగించి బిర్యానీ పాత్ర పెట్టి దానిలో నెయ్యి, నూనె వేయండి. దానిలో జీడిపప్పు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, లవంగాలు, బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి బాగా వేయించుకోవాలి. దానిలో ముందుగా రెడీ చేసుకున్న మసాలాను ఓ మూడు స్పూన్లు వేసి బాగా కలపాలి. మసాలా ఎంత బాగా ఫ్రై అయితే పలావ్ అంత టేస్ట్​గా వస్తుంది. ఇప్పుడు దానిలో 5 గ్లాసుల నీరు వేయాలి. 1 గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు లేదా రెండున్నర గ్లాసుల నీటి వేయొచ్చు. దానిలోనే ఉప్పు కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి మరగనివ్వాలి.


ఎసరు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసి బాగా కలపాలి. అన్నం పలుకు వీడిన తర్వాత.. అంటే మూడువంతులు ఉడికిన తర్వాత దానిలో ముందుగా తయారు చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. నీరు మొత్తం ఇంకిపోయే దాక స్టౌవ్ మీద కలుపుతూ ఉండాలి. నీరు ఇంకి పోయిన తర్వాత స్టౌవ్ వెలిగించి దాని మీద పెనం పెట్టుకుని.. మంటను సిమ్​లో ఉంచి.. ఈ బిర్యానీ పాత్రను దానిపై ఉంచి 15 నిముషాలు ఉడికిస్తే వేడి వేడి చికెన్ పులావ్ రెడీ. ఈ పండక్కి మీరు కూడా మీ ఇంటిల్లీపాదికి హాయిగా వండిపెట్టేయండి.  


Also Read : కరకరలాడే పెసర పునుగులు.. తయారు చేయడం ఇంత తేలికా అనిపించే రెసిపీ ఇదే