Tasty and Crispy Snacks Recipe : ఇంటి నిండా ఫ్యామిలీ ఉన్నప్పుడు సాయంత్రం స్నాక్స్​ గురించి ఏదొక పేచి ఉంటుంది. అలాంటి సమయంలో మీరు వారికి కరకరలాడే టేస్టీ రెసిపీని స్నాక్​గా చేసి పెట్టవచ్చు. పైగా దీనిని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. తయారు చేయడం కూడా చాలా తేలిక. ఇంట్లో తేలికగా దొరికే పదార్థాలతో తయారు చేసుకోగలిగే హెల్తీ స్నాక్ పెసర పునుగులు. ఇవి టేస్ట్​తో పాటు హెల్త్​కి కూడా మంచి చేస్తాయి. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


పెసర పప్పు - 2 కప్పులు


అల్లం - 1 అంగుళం (సన్నగా తరగాలి)


ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి)


పచ్చిమిర్చి - 3 (సన్నగా తరగాలి)


జీలకర్ర - 1 టీస్పూన్


కరివేపాకు - గుప్పెడు (సన్నగా తరగాలి)


కొత్తిమీర - 1 కట్ట (సన్నగా తరగాలి)


ఉప్పు - రుచికి తగినంత 


నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత 


తయారీ విధానం


మీరు ఈ పునుగులు చేయాలనుకుంటే ఓ గంట ముందే ప్లాన్ చేసుకోవాలి. పెసరపప్పును బాగా కడిగి.. ఓ గంట నీటిలో నానబెట్టాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమర్చి, అల్లం సన్నగా తరిగి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీరను కూడా బాగా సన్నగా తరిగి పెట్టుకుని పనుగులకు సిద్ధం చేసుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పును మరోసారి బాగా కడిగి నీరు లేకుండా మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. దానిలో ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా కాస్త పెసరపప్పు ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.


ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని దానిలో ఈ పెసరపప్పు మిశ్రమం వేయాలి. దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరగు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి పిండిని బాగా కలపాలి. పిండి మరీ పలుచగా ఉండకూడదు. అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. వేసిన అన్ని పదార్థాలు దానిలో కలిసేలా మాత్రం పిండిని బాగా చేతితో కలుపుకోవాలి. 


స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచండి. దానిలో డీప్​ ఫ్రైకి సరిపడనంత నూనె వేసుకుని మీడియం మంట మీద ఉంచండి. నూనె బాగా కాగిన తర్వాత రెడీ చేసుకున్న పెసరపిండి మిశ్రమంతో చిన్న చిన్న పునుగులు వేసుకోండి. పునుగులు 70 శాతం వేగిన తర్వాత వాటిని కడాయి నుంచి తీసేయండి. మిగిలిన పిండితో కూడా ఇలా చేయండి. పిండి అంతా పూర్తి అయిన తర్వాత అన్ని కలిపి మరోసారి వేయించండి. ఇలా చేయడం వల్ల పునుగులు సమానంగా వేగుతాయి. ఇంకెందుకు ఆలస్యం దీనిని మీరు వేడి వేడిగా లాగించేయడమే. 


ఈ పెసర పునుగులకు చట్నీ అవసరమే లేదు. మీరు కావాలనుకుంటే అల్లం చట్నీతో దీనిని సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే వేడి వేడి టీకి కాంబినేషన్​గా కూడా దీనిని ఇవ్వొచ్చు. పైగా ఈ ఆహారం ఆరోగ్యానికి కూడా మంచిదే కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని హాయిగా లాగించేయవచ్చు. ఈ రెసిపీని మీరు పెసలతో కూడా చేసుకోవచ్చు. కానీ మీరు వాటిని ఓ నాలుగు గంటల ముందే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఇదే రెసిపీని మీరు కరకరలాడే పునుగుల కోసం ఫాలో అవ్వొచ్చు. 


Also Read : టేస్టీ టేస్టీ రవ్వ లడ్డూ రెసీపీ.. ఇలా తయారు చేస్తే 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి