Red Sea Crisis Impact: ఎర్ర సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభంతో లక్షల కోట్ల డాలర్ల నష్టం జరిగే ప్రమాదముందన్న అంచనాలున్నాయి. చమురు మోసుకొస్తున్న ఓడలపై హౌతీలు దాడులు చేస్తున్నారు. ఫలితంగా...అవి నడి సముద్రంలో చిక్కుకుపోయాయి. ఈ దాడుల కారణంగా చమురు సరఫరాకి అంతరాయం కలుగుతోంది. ఈ పరిణామాలపై.. World Economic Forum అధ్యక్షుడు బార్జ్ బ్రెండే కీలక వ్యాఖ్యలు చేశారు. డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లై లేకపోవడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు 10-20% మేర పెరిగే ప్రమాదముందని బాంబు పేల్చారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. Suez Canal ని మూసేయడం వల్ల అంతర్జాతీయంగా చమురుతో పాటు నిత్యావసర సరుకుల సరఫరాకి అంతరాయం కలుగుతుందని...వాటి ధరలు అమాంతం పెరిగొచ్చని అంచనా వేశారు. దావోస్‌లో జరిగిన WEF సమావేశానికి హాజరైన బ్రెండే...ఈ విషయం ప్రస్తావించారు. ఇప్పటికే ఈ ప్రభావం మొదలైందని వెల్లడించారు. గతేడాదితో పోల్చి చూస్తే...వాణిజ్యంలో 0.8% మేర పడిపోయిందని వివరించారు. ఈ ఎర్ర సముద్ర సంక్షోభం కారణంగా వృద్ధి రేటు మరింత పడిపోవచ్చని చెబుతున్నారు. చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్‌ లాంటి దేశాల్లో ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సంక్షోభం మరింత ముదరకుండా ఉంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇదే సమయంలో భారత్ ఆర్థిక వ్యవస్థపై సానుకూలంగా మాట్లాడారు బ్రెండే. ఈ ఏడాది 8% మేర వృద్ధి రేటు నమోదయ్యే అవకాశముందని అన్నారు. డిజిటల్ ఎకానమీ పరంగా భారత్ రెట్టింపు వృద్ధి సాధించడం గొప్ప విషయమని ప్రశంసించారు. 


"ఎర్ర సముద్రంలో సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశముంది. చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ లాంటి దేశాల్లో ఈ ప్రభావం గట్టిగానే ఉంటుంది. దాదాపు 10-20 డాలర్ల మేర ధరలు పెరుగుతుండొచ్చు. అలా ఎర్ర సముద్రాన్ని ఎక్కువ రోజులు బ్లాక్ చేయలేం. అదే జరిగితే ఆ ప్రభావం మరింత పెరుగుతూ పోతుంది. అన్ని ధరలూ పెరిగిపోతాయి. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది"


- బార్జ్ బ్రెండే, WEF అధ్యక్షుడు 


సౌదీ అరేబియా, యెమెన్, ఈజిప్టు, ఇజ్రాయెల్‌, జోర్డాన్, డ్జిబౌటి, ఎరిట్రియా, సోమాలియా, ఈజిప్టు త‌దిత‌ర దేశాలు  ఈ ఎర్ర స‌ముద్ర తీరంలో ఉన్నాయి. ఆయా దేశాల‌కు ప్ర‌పంచ స్థాయిలో వాణిజ్య బంధాల‌ను కూడా ఈ స‌ముద్ర‌మే బ‌లోపేతం చేసింది. ఈ స‌ముద్రం గుండానే రూ.ల‌క్ష‌ల కోట్ల రూపాయల వ్యాపారం నిరంత‌రాయంగా సాగుతోంది. అయితే.. ఇప్పుడు ఈ స‌ముద్రం వివాదంగా మారింది. ఇజ్రాయెల్ పై పాల‌స్తానాలోని హ‌మాస్ ఉగ్ర‌వాదులు దాడులు చేసిన త‌ర్వాత‌.. ఈ దాడుల‌ను ఇజ్రాయెల్ ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. క‌న్నుకు క‌న్ను.. అన్న విధంగా ఎదురు దాడులు చేసి.. హమాస్‌ను నిర్మూలించే దిశ‌గా ఇజ్రాయెల్ భీక‌ర యుద్ధం సాగిస్తోంది. ఎర్ర స‌ముద్రం గుండా రాక‌పోక‌లు సాగించే వాణిజ్య నౌక‌ల‌ను టార్గెట్ చేసుకుని.. హౌతీ ఉగ్ర‌వాదులు పేట్రేగి పోతున్నారు. దీంతో ఏ దేశం నుంచి ఈ మార్గం గుండా నౌక‌లు ప్ర‌యాణిస్తున్నా.. వాటిని అడ్డుకుంటున్నారు. ధ్వ‌సం చేస్తున్నారు. పౌరుల‌ను సైతం చంపేస్తున్నారు. 


Also Read: అయోధ్య ఉత్సవానికి అందుకే రావడం లేదు, కారణం చెప్పిన శంకరాచార్యులు