Ayodhya Ram Mandir Opening:
కారణమిదేనట..
అయోధ్య ఉత్సవానికి (Ayodhya Event) నలుగురు శంకరాచార్యులు హాజరు కావడం లేదని ప్రకటించడం అలజడి రేపింది. ఈ నిర్ణయంపై కొంత మంది విమర్శలు చేశారు. అంత పెద్ద వేడుక జరుగుతుంటే ఎందుకు రావడం లేదని మండి పడ్డారు. అయితే..దీనిపై వాళ్లు క్లారిటీ ఇచ్చారు. పూరీ శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి మహారాజ్ తాను ఎందుకు హాజరు కావడం లేదో వివరించారు. వేడుకలు జరిపే తీరు తనకు నచ్చడం లేదని, ఆ ఆచారాలతో విభేదించే హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. దేశ ప్రధాని లోపల రాముడి ప్రాణప్రతిష్ఠ చేస్తుంటే తాము బయట కూర్చుని చూడాలనడం సరికాదని, ఇదే నచ్చలేదని తేల్చి చెప్పారు. అందుకే ఆహ్వానం (Ram Mandir) అందినప్పటికీ శంకరాచార్యులు ఎవరూ ఈ వేడుకకు రావడం లేదని తెలిపారు.
"శంకరాచార్యులెవరైనా సరే వాళ్లకంటూ ప్రత్యేక గౌరవం, హోదా ఉంటాయి. ఈ విషయంలో మాకు ఎలాంటి గర్వం లేదు. గర్భాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ రాముడి ప్రాణప్రతిష్ఠ చేస్తుంటే కేవలం బయట ప్రేక్షకుల్లా కూర్చుని చూడాలా..? ఆయనను పొగుడుతూ ఉండాలా.."
- స్వామి నిశ్చలానంద సరస్వతి మహారాజ్
రాజకీయ రగడ..
నలుగురు శంకరాచార్యులు ఈ వేడుకల్లో హాజరు కాకపోవడం రాజకీయంగానూ వేడి పెంచింది. అటు ప్రతిపక్షాలు ఇదే అదనుగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆలయ నిర్మాణం సగంలో ఉండగానే కావాలనే ఇలా హడావుడి చేస్తున్నారని మండి పడుతున్నాయి. ఇదంతా కేవలం ఎన్నికల స్టంట్ అంటూ విమర్శిస్తున్నాయి. శంకరాచార్యుల స్థాయి వ్యక్తులు ఈ వేడుకకు హాజరు కావడం లేదంటే దాని వెనక కారణాలంటే తెలుసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేస్తున్నాయి.
"అయోధ్య వేడుకల్ని రాజకీయం చేసినప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుతున్న శంకరాచార్యులు ఎందుకు వస్తారు..? అందుకే వాళ్లు రావడం లేదని తేల్చి చెప్పారు. వాళ్లీ ఉత్సవాన్ని బాయ్‌కాట్ చేశారు. వాళ్లు అలా చేశారంటే కచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది"
- అశోక్ గహ్లోట్, కాంగ్రెస్ నేత
ఈ నెల 22న అయోధ్య ఉత్సవానికి (Ayodhya Ram Mandir Opening) ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. వారం ముందు నుంచే 16వ తేదీనే సన్నాహక కార్యక్రమాలు మొదలు కానున్నాయి. దాదాపు వారం రోజుల పాటు అయోధ్య నగరం రామ నామ స్మరణ చేయనుంది. ఈ క్రమంలోనే ఏర్పాట్లకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust అందరికీ తెలియజేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి రానున్నారు. వేలాది మంది సాధువులు ఈ కార్యక్రమంలోనే పాల్గొననున్నారు. రామ మందిరాన్ని నిర్మించిన కూలీల కుటుంబ సభ్యులకూ ఆహ్వానం అందింది. అతిథులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 11 వేల మంది కీలక వ్యక్తులు వస్తారని అంచనా. వీళ్లలో చాలా మంది VIPలే ఉన్నారు. వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడంతో పాటు ఉత్సవానికి వచ్చినందుకు కృతజ్ఞతగా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వనున్నారు. జనవరి 12 నుంచి అయోధ్యకి వచ్చే వాళ్లకి సనాతన్ సేవా న్యాస్ (Sanatan Seva Nyas) సంస్థ టోకెన్‌లు ఇవ్వనుంది. రాముడి కానుకగా వీటిని అందజేయనున్నారు. దర్శనం పూర్తైన తరవాత ప్రసాదంతో పాటు ఈ గిఫ్ట్‌లు ఇస్తారు.
Also Read: భారత్‌లో చమురు ధరలు పెరుగుతాయేమో, ఎర్ర సముద్రం సంక్షోభంపై WEF చీఫ్ కీలక వ్యాఖ్యలు