Amalapuram News: అమలాపురం పార్లమెంటు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో సందిగ్ధం తొలగడం లేదు. ఇప్పటికే దాదాపు మూడు నాలుగు పేర్లు పరిశీలించిన వైసీపీ అధిష్టానం ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతోందట.. ఎస్సీ రిజర్వుడు స్థానం అయిన అమలాపురం పార్లమెంటు స్థానం ప్రత్యర్ధి పార్టీలకు చెందిన అభ్యర్థులను బలమైన వారిని దింపే ప్రయత్నంలో ఉండగా దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వైసీపీ చాలా పేర్లు పరిశీలిస్తుండగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే కాకినాడ, రాజమండ్రి పార్లమెంటు స్థానాలు ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం.. అయితే రిజర్వుడు స్థానం అయిన అమలాపురం పార్లమెంటు స్థానంపై ఓ నిర్ణయానికి రాకపోవడం వెనుక స్థానికంగా నెలకొన్న అనేక పరిణామాలు పునరాలోచనలో పడేలా చేస్తోందట.. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు అమలాపురం పార్లమెంటు స్థానం ప్రకటించకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

 

ఎలీజా పేరు పరిశీలన వెనుక కారణం ఇదేనా..

ఇంతవరకు అమలాపురం పార్లమెంటు స్థానంలో చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నెగ్గినవారే ఉన్నారు. ఎవ్వరు వచ్చినా ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. అయితే అమలాపురం అల్లర్ల తరువాత రాజుకున్న అనేక వివాదాలు ఎస్సీ సామాజికవర్గాన్ని విభజించి చూసేలా చేశాయి. దళితులంటే మాల వర్గమే కాదని, ఈ సారి మాదిగ వర్గాన్ని నిలబెట్టి గెలిపిస్తామని గతంలో అనేక కుల సమావేశాల్లో శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గ నేతలు ప్రకటించారు. ఇదిలా ఉంటే అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఉన్న మూడు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానం నుంచి ఏదో ఒక స్థానంలో మాదిగలకు అవకాశం కల్పించాలని వైసీపీ, టీడీపీ, జనసేన నాయకత్వానికి పలుసార్లు మాదిగలు విన్నవించుకున్న పరిస్థితి ఉంది.

 

ఈ నేపథ్యంలోనే అమలాపురం పార్లమెంటు స్థానానికి అటు మాల, మాదిగ వర్గాలను సంతృప్తి పరిచేవిధంగా అభ్యర్థిని బరిలోకి దింపితే ప్రయోజనం ఉంటుందని వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోందా అన్నది చర్చ జరుగుతోంది. దీనిని బలం చేకూర్చే విధంగా ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజాను అమలాపురం పార్లమెంటు స్థానానికి తీసుకువెళ్లాలని వైసీపీ అధిష్ఠానం ఆదేశించడం వెనుక కారణమన్న వాదన వినిపిస్తోంది. ఎలీజా ఎస్సీ మాల వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన సతీమణి మాదిగ సామాజికవర్గానికి చెందిన వారని, ఇందుకే ఆయన్ను ప్రత్యేకంగా ఎంపికచేసి వెళ్లాలని ఆదేశించడం వెనుక అసలు వ్యూహం ఇదేనన్న మాటలు వినిపిస్తున్నాయి.  అయితే చింతలపూడి నియోజకవర్గం వేరే అభ్యర్థికి కేటాయించడం వల్లనే ప్రత్యామ్నాయంగా ఎలీజాను అమలాపురం పార్లమెంటు స్థానానికి వెళ్లాలని పార్టీ ఆదేశించిందని మరో వాదన వినిపిస్తోంది.

 

పరిశీలనలో ఎమ్మెల్సీ ఇజ్రాయేల్‌ పేరు..?
అమలాపురం పార్లమెంటు స్థానానికి సంబందించి ప్రాతినిథ్యం వహించిన వారు ఎవరిని పరిశీలించినా మాల వర్గానికి చెందిన వారే ఉన్నారు. దీనికి తోడు ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారే అధికం. కుసుమ కృష్ణమూర్తి, స్వర్గీయ జీఎంసీ బాలయోగి, ప్రస్తుత ఎంపీ చింతా అనురాధ ముగ్గురు స్థానికులు. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ చింతా అనురాధ పేరు పున:పరిశీలన చేస్తున్నప్పటికీ ఆమె ఎక్కువగా ఏదో ఒక అసెంబ్లీ స్థానంపైనే ఆసక్తి కనబర్చడంతో వైసీపీ అధిష్ఠానం మరో ప్లాన్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు మాల సామాజికవర్గానికి కేటాయిస్తున్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కూడా వైసీపీ ఉన్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఇప్పటికే ప్రజల్లో ఉన్న ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్‌ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం ఉంది.