టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కింగ్‌ కోహ్లీ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ 20 క్రికెట్‌లో ఏ క్రికెట‌ర్‌కూ సాధ్యం కాని ఫీట్ న‌మోదు చేశాడు. టీ20 ప్రపంచ‌క‌ప్‌-2022 త‌ర్వాత కోహ్లి ఏడాదికి పైగా టీ20 జ‌ట్టుకు దూరంగా ఉన్నాడు. ఇండోర్ వేదిక‌గా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 నెలల తర్వాత కోహ్లీ బరిలోకి దిగాడు.  ఈ మ్యాచ్‌లో విరాట్ 16 బంతుల్లోనే నాలుగు ఫోర్ల సాయంతో 29 ప‌రుగులు సాధించాడు. ఈ క్రమంలో ఇంట‌ర్నేష‌న‌ల్ టీ20లో లక్ష్య ఛేదనలో 2000 ప‌రుగుల మైలురాయిని కోహ్లి అందుకున్నాడు. టీ 20 క్రికెట్‌ చరిత్రలో ఛేజింగ్‌లో 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ అరుదైన ఘ‌న‌త సాధించిన ఏకైక క్రికెట‌ర్‌గా చ‌రిత్రకెక్కాడు. ఇప్పటివ‌ర‌కు పొట్టి ఫార్మాట్ ఛేజింగ్‌లో కోహ్లి 46 ఇన్నింగ్స్ ఆడి 136.96 స్ట్రైక్‌రేటుతో 2012 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో 20 అర్ధ శ‌త‌కాలు ఉన్నాయి. వన్డేల్లో ఛేజింగ్‌లో 152 ఇన్నింగ్స్ ఆడి కోహ్లీ 7794 ర‌న్స్ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 27 సెంచ‌రీలు, న‌ల‌భై అర్ధ శతకాలు ఉన్నాయి. 


సిరీస్‌ భారత్‌ కైవసం
అఫ్గానిస్థాన్‌(Afghanistan )తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను టీమిండియా(Team India) మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. యశస్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal), శివమ్ దూబే (Shivam Dube) మెరుపు ఇన్నింగ్స్‌తో రోహిత్‌ సేన మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్‌ అయింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మరో 26 బంతులు మిగిలి ఉండగానే సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వి జైస్వాల్‌, శివమ్ దూబే అర్థ శతకాలతో భారత్‌కు విజయాన్ని అందించారు.


ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా... అఫ్గాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభం నుంచే అఫ్గాన్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేసింది. రహ్మతుల్లా గుర్బాజ్‌.. ఇబ్రహీం జర్దాన్‌ తొలి వికెట్‌కు 2 ఓవర్లలోనే 20 పరుగులు జోడించారు. కానీ వెనువెంటనే వీరిద్దరూ అవుటయ్యారు. 14 పరుగులు చేసిన గుర్బాన్‌ను రవి బిష్ణోయ్‌.... పెలిలియన్‌కు పంపాడు. అనంతరం గుల్బదీన్‌ నయీబ్‌ అఫ్గాన్‌కు మంచి స్కోరు అందించాడు. కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతో గుల్బదీన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 57 పరుగులు చేసిన గుల్బదీన్‌ను అక్షర్‌ పటేల్ అవుట్‌ చేశాడు.  అఫ్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇన్నింగ్స్‌ చివరి బంతికి రనౌట్‌ కావడంతో అఫ్గాన్ ఇన్నింగ్స్‌ ముగిసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌సింగ్‌ 3, రవి బిష్ణోయ్‌, అక్షర్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు తీశారు.


యశస్వి, దూబే విధ్వంసం
లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్‌ అఫ్గాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో యశస్వి 68 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పేశాడు. 14 నెలల తర్వాత టీ 20ల్లో బరిలోకి దిగిన విరాట్‌ కోహ్లీ ఉన్నంతసేపు మంచి టచ్‌లో కనిపించాడు. కేవలం 16 బంతుల్లో అయిదు చూడముచ్చని ఫోర్లతో కింగ్‌ కోహ్లీ 29 పరుగులు చేశాడు. శివమ్‌ దూబే కేవలం 32 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో దూబే 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దూబే విధ్వంసంతో మ్యాచ్‌ భారత్‌ వశమైంది. 173 పరుగుల లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి భారత్‌ ఛేదించింది.