Ram Mandir Consecration News: అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయోధ్య ఉత్సవానికి వెళ్లాలనుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే (Indian Railways) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా రైళ్ల రాకపోకలు సాగించేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం రైల్వే ట్రాక్ డబ్లింగ్ (సింగిల్ ట్రాక్ డబ్లింగ్), విద్యుదీకరణ పనులు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జనవరి 16 నుంచి 22 వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో సహా 10 ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసింది. డూన్ ఎక్స్‌ప్రెస్ సహా 35 రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లించింది. పనులు వేగంగా పూర్తి చేసి రామమందిరం ప్రారంభానికి అందుబాటులోకి తీసుకొచ్చేలా శరవేగంగా పనులు చేపడుతోంది.
రామ్‌లల్లా పవిత్రోత్సవానికి సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని, అయోధ్య రైల్వే సెక్షన్‌లో ట్రాక్ డబ్లింగ్‌కు ప్రాధాన్యత ఇస్తోందని, దీని కింద ట్రాక్ డబ్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. అయోధ్య నుంచి ఆనంద్ విహార్ (ఢిల్లీ)కి వెళ్లే వందే భారత్ రైలును ట్రాక్ నిర్వహణ కారణంగా జనవరి 15 వరకు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రైలును జనవరి 22 వరకు రద్దు చేసినట్లు నార్తర్న్ రైల్వే లక్నో డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రేఖా శర్మ వెల్లడించారు.
ఈ రైళ్లు రద్దు..
పాట్లీపుత్ర - లక్నో జంక్షన్ (12529) జనవరి 19, 20 తేదీలలో రద్దు
లక్నో జంక్షన్ - పాట్లీపుత్ర (12530) జనవరి 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు రద్దు
గోరఖ్‌పూర్ - ఐష్‌బాగ్ (15069) జనవరి 17 నుంచి 22 వరకు
ఐష్‌బాగ్ - గోరఖ్‌పూర్ (15070) జనవరి 16 నుంచి 22 వరకు
గోమతీనగర్ - చప్రా కచారి (15113) జనవరి 16 నుంచి 22 వరకు
ఛప్రా కచారి - గోమతీనగర్ (13114) జనవరి 15 నుంచి 22 వరకు
అందుబాటులో హెలికాప్టర్..
అయోధ్యలో పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవానికి ముందే హెలికాప్టర్ సేవలను ప్రారంభించనున్నారు. జనవరి 22 లోపు భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభమవుతుందని యూపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. అలాగే ప్రజలను ఓడ ద్వారా కూడా అయోధ్యకు తీసుకెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వేడుకలకు తరలిరానున్న ప్రముఖులు
అయోధ్యలో రామ మందిరం 2024 జనవరి 22న ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో రామ్ లల్లాకు పట్టాభిషేకం జరగనుంది . రాజకీయ నాయకులు, సినిమా, క్రీడలు, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు, ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటారు. ప్రధాన కార్యక్రమానికి ముందు, ప్రత్యేక ఆచారాలు మంగళవారం (జనవరి 16, 2024) నుంచి ప్రారంభమయ్యాయి, జనవరి 21 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి.