కొత్తగూడెం నియోజకవర్గంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వంలో కలవరం మొదలైంది. వనమా రాఘవపై కేసుల నేపథ్యంలో కొత్తగూడెంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు ఎవరికి వారే అన్నట్లుగా తయారైంది. వనమా కుటుంబానికి రాజకీయ భవిష్యత్‌ ఉండదనే భయంతో కార్యకర్తలు మంత్రి పువ్వాడ వైపు కొంత మంది వెళ్లగా, మరికొంత మంది ఎంపీ నామా నాగేశ్వరరావు వద్దకు, కొంత మంది మాజీ ఎంపీ పొంగులేటి వద్దకు వెళుతున్నారు. తమకు అండగా ఉండేందుకు ఓ నాయకుడు కావాలని భావిస్తున్న నాయకులు ఇప్పటికే  ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 
సమయం కోసం వేచి చూసి..
కొత్తగూడెం నియోజకవర్గంలో ఆది నుంచి వర్గ విభేదాలు నెలకొన్నాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయం సాధించిన వనమా వెంకటేశ్వరరావు ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో జాయిన్‌ అయ్యారు. అప్పటి వరకు టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు అనుచరులుగా ఉన్నారు. అయితే పార్టీ మారిన తర్వాత జలగం వెంకటరావు కొత్తగూడెంలో ఉండకపోవడం, స్థానికంగా వనమా రాఘవ నుంచి తమకు ఇబ్బందులు తప్పవనే నేపథ్యంలో వెంకటరావు వద్ద అప్పటి వరకు ఉన్న కార్యకర్తలు కాస్తా వనమా గూటికి చేరారు. అయితే ఒక గూటికే చేరినప్పటికీ తరుచూ అంతర్గతంగా మాత్రం ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. మరోవైపు కొత్తగూడెం సింగరేణి ప్రాంతంలో గట్టి పట్టు సాదించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాన్ని సైతం వనమా రాఘవ తనవైపు తిప్పుకున్నారు. 
ఆదిపత్యాన్ని భరించలేక...
కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఉనప్పటికీ ఆయన తనయుడు రాఘవ మాత్రం అన్ని తానై నడిపించారు. నియోజకవర్గంలో ప్రతి విషయంలో రాఘవ జోక్యం ఉండటంతోపాటు కిందిస్థాయి కార్యకర్తలకు ఎలాంటి ఎదుగుదల లేకుండా చేసినప్పటికీ భయంతోనే ఇప్పటివరకు వనమా చెంత ఉన్న కార్యకర్తలు ఇప్పుడు తలోదారి వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్ట్‌ కమీషన్ల దగ్గర్నుంచి పోలీస్‌ స్టేషన్‌లో పంచాయతీల వరకు రాఘవ నేతృత్వంలో జరుగుతుండటంతో స్థానిక ప్రజాప్రతనిథులు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిణామాలు కలిసి రావడంతో జిల్లాలోని మిగిలిన నాయకుల వద్దకు క్యూ కడుతున్నట్లు సమాచారం. 
పేటీఎం బ్యాచ్‌ జంప్‌ జిలానీ..
కేవలం సెటిల్‌మెంట్‌లే కాకుండా వనమా రాఘవ నియోజకవర్గంలోని కొన్ని పోస్టులను అమ్మకానికి పెట్టినట్లు ఆరోపణలున్నాయి. పదవి కావాలంటే కప్పం కటాలనే తీరున రాఘవ వ్యవహార శైలి ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నగదు చెల్లించి పదవులు తెచ్చుకున్న నాయకులు ఇప్పుడు కప్పదాట్లకు సిద్దమయ్యారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నుంచి ఎంపీపీల వరకు ఇలా కప్పం చెల్లించే తెచ్చుకున్నారని పెద్ద ప్రచారం సాగింది. కొన్ని పదవులకు కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. 


పైసలు పెట్టి పదవులు కొనుక్కున్నా రాబడి లేకపోవడం, అన్ని విషయాల్లో రాఘవ పెత్తనం ఉండటంతో ఇటీవల కాలంలో కొత్తగూడెం మున్సిపల్‌ కౌన్సిల్‌లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పైసలు పెట్టి పదవులు తెచ్చుకున్న నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇది రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు మార్పు తెస్తుందనే విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. 


Also Read: Telangana: రాష్ట్రంలో కరోనా ప‌రిస్థితుల‌పై నేడు హైకోర్టులో మరోసారి విచార‌ణ‌.. నెక్ట్స్ ఏంటి ?


Also Read: Weather Updates: తెలంగాణలో వడగండ్ల వానలు.. ఏపీలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్.. ఎల్లో అలర్ట్ జారీ


Also Read: Bhatti Vikramarka: సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కకి కరోనా పాజిటివ్.. టెస్టులు చేయించుకోవాలని వారికి సూచన


Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి