Telangana High Court On Corona Cases: తెలంగాణలో కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర హై కోర్టు రంగంలోకి దిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, ఒమిక్రాన్ కేసులు, తాజా కోవిడ్19 పరిస్థితులపై నేడు మరోసారి తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. గత ఏడాది సైతం కరోనా వ్యాప్తి పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు మధ్య భిన్నాభిప్రాయలు వ్యక్తమమయ్యాయి. జనవరి 12 వ తేదీ వరకు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. నేడు దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది.
ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి సాధారణంగా ఉందని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ వైరస్ వ్యాప్తిని అదుపులోకి తెచ్చేందుకు పలు చర్యలు చేపట్టినట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. సంక్రాంతికి ముందు వరకు అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 6.95 శాతం పాజిటివిటీ రేటు ఉంది. మరోవైపు జీహెచ్ఎంసీలో 5.65 శాతం రోజువారీ పాజిటివిటీ రేటు ఉందని హైకోర్టుకు వివరించారు. కేంద్రం సూచనలు పాటిస్తున్నామని నివేదికలో పేర్కొన్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 10 శాతానికి మించితేనే నైట్ కర్ఫ్యూ లాంటి కొవిడ్19 నిబంధనలు పాటించాలని సూచించినట్లు హైకోర్టుకు స్పష్టం చేశారు.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 55,883 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. కొత్తగా 2,043 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా మరో ముగ్గురు మృతి చెందారు. కరోనా బారి నుంచి మరో 2,013 మంది పూర్తిగా కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 22,048 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు పది శాతం దాటితే ఆఫీసులలో సిబ్బంది, నైట్ కర్ఫ్యూ ఆంక్షలు, తదితర విషయాలపై ఆంక్షలు విధిస్తామని డీహెచ్ శ్రీనివాస రావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో సగటున పాజిటివిటీ రేటు 2.76 శాతం ఉందని తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య శాఖ సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే