ఇప్పటి వరకూ ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతూ వస్తున్నారని ఇప్పుడిక వ్యవసాయమే వద్దని చెబుతున్నారా అని కేంద్రంపై టీఆర్ఎస్ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి విరుచుకుపడ్డారు. ఎరువుల ధరల పెంపు అంశంపై తెలంగాణభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రులు కేంద్ర విధానాలపై ఘాటు విమర్శలు చేశారు. అన్నం పెట్టే రైతన్న కు అడుగడుగునా కేంద్రం ఇబ్బందులు సృష్టిస్తోందని.. ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయి లో ఉన్న దేశాన్ని వ్యవసాయం నుంచి తప్పించే ఆలోచన చేస్తున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. మొన్నటి దాకా ధాన్యం కొనమన్నారు. ఇప్పుడేమో ఏకంగా వ్యవసాయమే వద్దంటున్నట్టుందన్నారు. కరెంటు కు మీటర్లు అంటారు.. ఎరువుల ధరలు పెంచుతారు. ఇక రైతు వ్యవసాయం ఎలా చేస్తాడని మంత్రులు ప్రశ్నించారు. 


Also Read: తెలంగాణలో జీవో 317 మంటలు ! ఆ జీవోలో ఏముంది ? ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ?     


బీజేపీ కి రైతు విభాగం కిసాన్ మోర్చా కూడా ఉందని ఎరువుల ధరల పెంపుపై కిసాన్ మోర్చా ప్రధాని మాట్లాడితే .. రైతుల బాధేంటో తెలుస్తుందన్నారు. ఆర్ ఎస్ ఎస్ కూడా బీజేపీ కి అనేక విషయాల మీద సలహాలు ఇస్తుంది.. ఆ సంస్థ వాళ్ళు రైతులను ఇబ్బందులు పెట్టమని చెప్పారా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారం లో లేని రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడమే పని గా పెట్టుకున్నారని..తెలంగాణ కు పేరొస్తే దేశానికి పేరొచ్చినట్టు కాదా అని మంత్రులు మండిపడ్డారు.  తెలంగాణ వ్యవసాయ విధానాలు ఎందుకు కేంద్రానికి నచ్చడం లేదన్నారు. 


Also Read: రాఘవ కేసులో పోలీసులపై ఒత్తిడి? రౌడీషీట్‌ ఓపెన్ చేయకుండా ఆడ్డుకుంటుందెవరు?



పీఎం కిసాన్ నిధికి సవా లక్ష నిబంధనలు పెడుతున్నారని కానీ ఏ రూల్స్ లేకుండా రైతు బంధు కింద ఎకరానికి పది వేలు ఇస్తున్నామన్నారు. రైతులను ఇబ్బంది పెడితే కెసీఆర్ పిడికిలి బిగిస్తారని హెచ్చరించారు. దేవిలాల్, చరణ్ సింగ్ లా కేసీఆర్ రైతు పక్షపాతి.. రైతుల కోసం ఎంతకైనా తెగిస్తారని స్పష్టం చేశారు. మాటి మాటికి కేసీఆర్ ను జైల్లో పెడతామంటున్నారని జైలంటే కేసీఆర్‌కు భయం లేదని స్ఫష్టం చేశారు....కేసీఆర్ ను టచ్ చేసి చూడండి.. తెలంగాణ అంటే ఏమిటో తెలుస్తుందని హెచ్చరించారు. రాష్ట్రానికి సహాయం చేయకపోగా కక్ష కడుతున్నారని మండిపడ్డారు. 



సీఎం కేసీఆర్ వి గొంతెమ్మ కోరికలు కాదని..రైతులకు న్యాయం చేయమంటే తప్పెలా అవుతుందని మంత్రులు ప్రశ్నించారు. ఎరువుల ధరలను పెంచడాన్ని బీజేపీ సమర్ధించగలదా అని సవాల్ చేశారు. పచ్చటి తెలంగాణ లో విషం కలపాలని బీజేపీ కుట్ర చేస్తోందని బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు లేఖ రాయడం కాదు. ముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చేయలేని పీఎం మోడీ ని ప్రశ్నించాలని సవాల్ చేశారు. అన్నీ వర్గాల సమస్యలను సీఎం కేసీఆర్ తీరుస్తున్నారు. భవిష్యత్ లో కూడా తీరుస్తారని బీజేపీ నేతలు పిచ్చి పిచ్చి కూతలు మానుకోవాలని మంత్రులు హెచ్చరించారు. 


Also Read: ఫ్రంట్ లేదు టెంట్ లేదు.. ఏ క్షణమైనా కేసీఆర్ జైలుకు వెళ్తారన్న బండి సంజయ్ !



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి