వనమా రాఘవ పేరు గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతుంది. ఇతని బెదిరింపులకు తట్టుకోలేక ఓ నిండు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో రాఘవ చేసిన ఆకృత్యాలు బట్టబయలయ్యాయి. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కొత్తగూడెం నియోజకవర్గంలో రాఘవ చేస్తున్న అక్రమాలు, అవినీతి బాగోతం వెలుగు చూసింది. 12 కేసుల్లో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న రాఘవపై రౌడీషీట్ నమోదు చేస్తామని పోలీసులు చెప్పినప్పటికీ రౌడీషీట్ ఓపెన్ చేయకపోవడం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
పేరుకే తండ్రి ఎమ్మెల్యే.. పెత్తనమంతా రాఘవదే..
తన తండ్రి వనమా వెంకటేశ్వరరావు పదవిని అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు వనమా రాఘవేందరావు తానే యువరాజుగా చలామణి అవుతూ వచ్చారు. నియోజకవర్గంలో తాను చెప్పిందే చేయాలంటూ అందర్నీ బెదిరించాడు. అధికారులను కూడా భయపెట్టి అక్రమాలకు తెరతీశాడు. మూడు దశాబ్దాల పాటు రాఘవ అనేక నేరాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. రాజకీయంగా తన బలాన్ని వాడుతూ ఎవరూ ప్రశ్నించకుండా... ప్రశ్నించిన వాళ్లను అంత చేస్తూ ముందుకు సాగినట్లు తెలుస్తోంది. ఎవరైనా కేసులు పెట్టేందుకు ముందుకు వస్తే వారిపై బల ప్రదర్శన చేస్తూ అధికారులను గుప్పెట్లో పెట్టుకొని అసలు ఫిర్యాదులే నమోదు కాకుండా చూసుకున్నాడు. సెటిల్‌మెంట్లు, భూదందాలతో కోట్లాది రూపాయలు వెనుకేసుకోవడంతోపాటు ఎవరికి తెలియకుండా ఓ నేర సామ్రాజ్యాన్ని రాఘవ ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది.
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతో..
రాఘవ బెదిరింపులకు తట్టుకోలేక నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటంతో ఒక్కసారిగా రాఘవ అరాచకాలపై అందరి దృష్టి పడింది. మీడియాతోపాటు సామాజిక మాద్యమాల్లో రాఘవ నేరాకృత్యాలపై విమర్శలు రావడంతో పోలీసులు పరుగులు పెట్టారు. రాఘవకు సంబంధించిన కేసులపై దృష్టి సారించారు. పెండింగ్ కేసుల విచారణ వేగవంతం చేశారు. ఈ మేరకు పాల్వంచ ఏఎస్సీ, ఐపీఎస్ అధికారి రోహిత్ రాజ్ రాఘవపై 12 కేసుల్లో తీవ్ర నేరారోపణలు ఉన్నాయని, అతనిపై రౌడీషీట్ నమోదు చేస్తామని ప్రకటించారు. ఇందుకు సంబందించిన ఫైల్ సైతం సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పెండింగా..?
వనమా రాఘవపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఓపెన్‌గా చెప్పిన పోలీస్ అధికారులు ఇంత వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి రోజులు గడుస్తున్నా రౌడీషీట్ మాత్రం ఇప్పటివరకు నమోదు కాలేదు. రాఘవపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా గళం వినిపిస్తున్నా పోలీసులు చర్యలు స్టార్ట్ చేయలేదు. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే ఇది ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. సాధారణంగా ఎవరైనా ఒకటి రెండు క్రిమినల్ కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటే వారిపై రౌడీషీట్ నమోదు చేస్తారు. పీడీ యాక్ట్ కూడా పెడతారు. కానీ ఎమ్మెల్యే కుమారుడు కావడంతోనే రాఘవపై రౌడీషీట్ ఓపెన్ చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు పోలీస్ ఉన్నతాధికారులు ఆ దిశగా అడుగులు వేసినప్పటికీ ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని తెలుస్తోంది. అందుకే రౌడీ షీట్ ఫైలును కాస్తా పెండింగ్‌లో పెడుతున్నట్లు నియోజకవర్గవ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఘంటాపథంగా చెప్పిన పోలీస్ అధికారులు ఆ దిశగా ముందుకు సాగుతారా..? అధికార ఒత్తిడికి తలొగ్గుతారా..? అనేది వేచి చూడాల్సిందే.
Also Read: వనమా రాఘవ అరెస్టు... హైదరాబాద్‌కు వస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
Also Read: ఆస్తి తగాదాలు.. అక్రమ సంబంధాలు.. రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో వైరల్
Also Read: టీఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెషన్... నాడే శిక్ష వేసి ఉంటే నేడు నాలుగు ప్రాణాలు దక్కేవి
Also Read: ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీలు ఇవే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి