ఖమ్మం జైలు లో ఆడబిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించి మానవ హక్కుల ఉల్లంఘన చేసిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. సెప్టెంబర్ 17 లోగా రాష్ట్రంలోని పోడు భూముల అన్నింటికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి దళిత, గిరిజన, ఆదివాసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
గిరిజన, ఆదివాసీ జీవితాల్లో వెలుగు నింపిన ఐటీడీఏలు టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. తక్షణం వాటిని పునరుద్ధరించే విధంగా నిధులు విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పటి వరకు దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోరాలతో ప్రజాక్షేత్రంలో కేసీఆర్ సర్కార్ పై పోరును మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం తన బుద్ధిని మార్చుకోవాలని సూచించారు.
ఇంకా లేఖలో రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
గిరిజనులు, ఆదివాసీలు, దళితుల పట్ల మొదటి నుంచి మీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. నేరేళ్లలో మీ బంధువుల ఇసుక మాఫియాను అడ్డుకున్నారని దళిత యువత పై థర్డ్ డిగ్రీ ప్రయోగింపజేశారు. మిర్చీకి మద్దతు ధర అడిగిన పాపానికి ఖమ్మంలో గిరిజన రైతుల చేతులకు బేడీలు వేయించి, దొంగల్లా వారిని నడిరోడ్డు పై నడిపించి అవమానం చేశారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల్లో సైతం దళితులనే ఎక్కువగా టార్గెట్ చేశారు. ఇటీవల కాలంలో పోడు భూముల అంశంలో ఆదిలాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ లాంటి జిల్లాల్లో వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్నగర్ లో పోడు భూములకు సంబంధించిన అంశంలో మొత్తం 23 మందిని ఈ నెల 4, 5 తేదీల్లో అరెస్టు చేస్తే అందులో 20 మంది మహిళలే. ఇందులో పసిపిల్లల తల్లులు ముగ్గురు ఉన్నారు. చిన్నారులతోపాటు వీరందరినీ ఖమ్మం జైలుకు తరలించారు. హత్యాయత్నం కింద కేసులు కూడా నమోదు చేశారు.
అరెస్ట్ అయిన మహిళలను ఈ నెల 11వ తేదీన బెయిల్ పై విడుదల చేశారు. వీరందరిపై ముందుగా ఎఫ్ఐఆర్లో ఐపీసీ 307, 353, 148 రెడ్ విత్ 149 సెక్షన్లు పెట్టిన పోలీసులు, తర్వాత విమర్శలతో కాస్త వెనక్కితగ్గారు. హత్యాయత్నం సెక్షన్లు 307, 148ని వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో జిల్లా న్యాయస్థానంలో గిరిజనులకు ఈ నెల 10న బెయిల్ దొరికింది.
అరెస్టయిన గిరిజన మహిళల పట్ల ఖమ్మం జిల్లా జైలు సిబ్బంది అమానవీయంగా వ్యవహరించారని బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. అన్నం పెట్టమంటే తమతో కాళ్లు మొక్కించుకున్నారని, బూతులు తిడుతూ కర్రలతో కొట్టారని, టాయిలెట్లు కడిగించారని, 20 బస్తాల బియ్యం బాగు చేయించారని, బాలింతను గదిలో పెట్టి బంధించారని, చర్లపల్లి జైలుకు తరలిస్తామని, ఇక్కడ చంపేసినా అడిగే దిక్కులేదంటూ బెదిరించారని విడుదల అనంతరం బాధిత మహిళలు ధర్నాలో ఆవేదన వ్యక్తం చేశారు. వారి వేదన నన్ను కలచివేసింది.
ఇలాంటి మానవత్వం లేని ఘటనలను ఎంత మాత్రం ఉపేక్షించలేము. మరియమ్మ విషయంలో పోలీసులు ఇలాగే వ్యవహరించి నిండు ప్రాణాన్ని బలిగొన్నారు.
రేవంత్ రెడ్డి లేఖలో చేసిన డిమాండ్లు..
- ఖమ్మం జైల్లో ఆడబిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించి, మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డ సంబంధిత అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలి.
- సెప్టెంబర్ 17లోగా రాష్ట్రంలోని పోడు భూముల అన్నింటికీ పట్టాలు ఇవ్వాలి.
- రాష్ట్రంలోని ప్రతి దళిత, గిరిజన, ఆదివాసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి.
- గిరిజన, ఆదివాసీ జీవితాల్లో వెలుగు నింపిన ఐటీడీఏలు మీ ప్రభుత్వ హయాంలో శిధిలావస్థకు చేరుకున్నాయి. తక్షణం వాటిని పునరుద్ధరించే విధంగా నిధులు విడుదల చేయాలి.