Top 5 Telugu Headlines Today 07 October 2023: 

కాంగ్రెస్‌లో విలీనానికి బ్రేక్, అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్‌గానే వైఎస్ఆర్టీపీ పోటీ!కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనానికి బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. ఇదిగో విలీనం, అదిగో హడావుడి చేసినప్పటికీ, ఇప్పుడీ అంశంపై అటు వైఎస్సార్టీపీ నేతలు, ఇటు కాంగ్రెస్ నేతలు ఎవరు స్పందించడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అటు 119 స్థానాలకు అభ్యర్థులను ఖ‌రారు చేసేందుకు కాంగ్రెస్‌ ముమ్మర కసరత్తు చేస్తోంది. దీంతో హస్తం పార్టీలో షర్మిల పార్టీ విలీనం లేనట్లేనని ప్రచారం జోరందుకుంది. పూర్తి వివరాలు

ఢిల్లీకి వెళ్లిన నారా లోకేశ్, చంద్రబాబు బెయిల్ పై లాయర్లతో చర్చలుతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  ఢిల్లీ వెళ్లారు. రాజమహేంద్రవరం నుంచి రోడ్డుమార్గంలో గన్నవరం చేరుకుని, అక్కడి 9 గంటలకు విమానంలో ఢిల్లీ వెళ్లారు. సుప్రీంకోర్టులో సోమవారం క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై పలువురు జాతీయ నేతలను కలిశారు. పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ ముందు ఆందోళనకు దిగారు. నిన్న రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత, తండ్రి చంద్రబాబు నాయుడును భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేశ్‌ ములాఖత్‌ అయ్యారు. పూర్తి వివరాలు

కృష్ణా నదిలో నీటి బొట్టును కూడా వదులుకోం - సుప్రీంకోర్టుకు వెళ్తామన్న అంబటి రాంబాబు !కృష్ణా జిల్లాలపై ఉన్న అడ్డంకులను తొలగించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణా జలాల పునఃపంపిణీని ఆపేయాలని కోరామని, ఈ మేరకు ప్రధానికి సీఎం జగన్‌ లేఖ రాశారన్నారు. ‘‘రాష్ట్రానికి నష్టం జరిగే విధానాన్ని మేం ఒప్పుకోం. కృష్ణా జలాలపై న్యాయ పోరాటం చేస్తాం. కృష్ణా జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. కొత్తగా విధి విధానాలు రూపొందించడానికి ఒప్పుకోం. ఏపీకి రావాల్సిన ప్రతి నీటిబొట్టును తీసుకుంటాం. అన్యాయంగా తీసుకెళ్తామంటే ఒక్క నీటిబొట్టును కూడా వదులుకునేది లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పూర్తి వివరాలు

ఐటీ కంపెనీలు ఏపీకి పంపించడం కాదు, కృష్ణా నీటి వాటా సంగతేంటో చెప్పండి, కేటీఆర్‌కు శైలజానాథ్ కౌంటర్ఐటీ కంపెనీలను ఏపీకి పంపిస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి శైలజానాథ్ కౌంటర్ ఇచ్చారు. కంపెనీలు పంపిస్తాం, స్థలాలు ఇప్పిస్తామని చెప్పడం కాదని, కృష్ణా నీటి వాటా సంగతి తేల్చాలని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. ఐటీ కంపెనీలను ఏపీకి పంపిస్తామని కేటీఆర్ చులకన భావనతో మాట్లాడటం.. తమ మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ రాయలసీమకు చావు దెబ్బలాంటిదని పేర్కొన్నారు. బీజేపీ అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక ఎన్నికల కోసం వాడుకుందని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కోసమే కృష్ణా జలాల పంపిణీపై కొత్త నోటిఫికేషన్ ను బీజేపీ ఇచ్చిందని ఆరోపించారు. పూర్తి వివరాలు

ఈనెల 15 నుంచి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర, హాజరుకానున్న ఖర్గే, ప్రియాంక, రాహుల్ఈ నెల 14వ తేదీ తర్వాత ఏ క్షణమైనా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెలువడుతుందన్న అంచనాల వేళ.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు తలపెట్టిన బస్సు యాత్రను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు సమాచారం. ఈ బస్సు యాత్రను ప్రారంభించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రానున్నారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొనేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. ఈ నెల 9వ తేదీన లేదా 10వ తేదీన జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో షెడ్యూల్, రూట్ మ్యాప్ ను ఖరారు చేయనున్నారు. పూర్తి వివరాలు